తాండూర్/ వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 11 : ఏ మాత్రం అవగాహన లేని రంగం.. డబ్బులు సంపాదించాలనే ఆశ.. అప్పులు చేసి మరీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు ఆ యువకుడు.. చివరికి నష్టాలు రావడం.. చేసిన అప్పులు తీర్చేమార్గం లేక కుటుంబంతోపాటు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కాసిపేటలో జరిగింది. వివరాలిలా.. కాసిపేటకు చెందిన సముద్రాల శివప్రసాద్ (26) ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు.
డబ్బు సంపాదించాలనే ఆశతో స్టాక్ మారెట్లో పెట్టుబడుల కోసం యూట్యూబ్‌లో చూసి అవగాహనకు వచ్చాడు. తెలిసిన వారి దగ్గరల్లా సుమారు రూ. 40 లక్షలు అప్పు చేసి స్టాక్ మారెట్లో పెట్టాడు. చివరకు నష్టాలు వచ్చాయి. చేసిన అప్పులు, వాటికి వడ్డీలు పెరిగిపోవడంతో ఏం చేయాలో దికుతోచని స్థితిలోపడ్డాడు. అప్పులిచ్చిన వాళ్లు ఒత్తిడి చేయడంతో శివప్రసాద్ కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి.. అక్కడ ఆత్మహత్యాయత్నం చేశాడు. అకడి 108 సిబ్బంది ఇచ్చిన సమాచారంతో శివప్రసాద్‌ను తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు.
ఈ క్రమంలో అప్పులు తీర్చే మార్గం లేక శివప్రసాద్‌తో పాటు తల్లిదండ్రులు మొండయ్య (60), శ్రీదేవి (50), అక చైతన్య (చిట్టి (30)-దివ్యాంగురాలు) మంగళవారం తెల్లవారుజామున కూల్‌డ్రింక్‌లో గడ్డి మం దు కలుపుకొని తాగారు. వీరి అరుపులు విని వచ్చిన చుట్టుపక్కలవారు వారిని వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. అకడ చికిత్స పొందుతూ సముద్రాల మొండయ్య, ఆయన భార్య శ్రీదేవి, కూతురు చైతన్య, కుమారుడు శివప్రసాద్ మృతి చెందారు. శివప్రసాద్ మేనమామ కోలేటి రమేశ్ ఫిర్యా దు మేరకు తాండూర్ ఎస్ఐ డీ కిరణ్‌కుమార్ కేసు దర్యాఫ్తు చేస్తున్నారు. తాండూర్ సీఐ కుమారస్వామి, ఎస్ఐ ఎంజీఎంకు వెళ్లి మృతదేహాలను పరిశీలించారు.