మద్దూరు(ధూళిమిట్ట), జనవరి08 : ఇంట్లోనే గంజాయి మొక్కలు(Marijuana plants) పెంచుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా(Siddipet) మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ షబ్బీర్ అనే వ్యక్తి తన ఇంటి వద్ద గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు అందిన సమాచారం మేరకు అతనిని అరెస్టు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ షేక్ మహబూబ్ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ మహ్మద్ షబ్బీర్ గత కొన్నాళ్లుగా తన ఇంటి వెనుకాల ఉన్న పాడుబడిన స్థలంలో కొన్ని గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు.
గంజాయి మొక్కల నుంచి తీసిన ఆకులను ఆరబెట్టిన అనంతరం వాటిని బీహార్‌కు చెందిన కూలీలకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు అందిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ అధికారుల సహకారంతో షబ్బీర్ ఇంటితో పాటు పరిసరాలలో సోదాలు నిర్వహించగా గంజాయి మొక్కలు లభ్యమైనట్లు తెలిపారు. నిందితుని వద్ద 38 గ్రాముల గంజాయి, రెండు గంజాయి మొక్కలు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వివరించారు. సమావేశంలో ఏఎస్ఐ విజయ్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్ జనార్దన్, కానిస్టేబుళ్లు ఉన్నారు.