రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో నకిలీ పాస్బుక్ల గుట్టు రట్టయింది. గుట్టు చప్పుడు కాకుండా ఫేక్ పాస్ పుస్తకాలు తయారుచేస్తూ అడిగిన వారిని చంపేస్తానని బెదిరిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కోనరావుపేటకు చెందిన మస్కురి కాశీరామ్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్యేగా పనిచేసేవాడు. భూ రికార్డులకు సంబంధించి అనుభవం సంపాదించి రెవెన్యూ అధికారులతో సంబంధాలున్నాయని ప్రజలను నమ్మించాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన దండుగుల కనుకయ్యకు ప్రభుత్వ భూమి పొందేందుకు సహాయం చేస్తానని నమ్మించి 3 ఎకరాల పట్టా పాస్ పుస్తకం తయారు చేసి రూ.లక్ష వసూలు చేశాడు. అతడి భార్య దండుగుల పోశవ్వ పేరు మీద గ్రామ శివారు సర్వే నెంబర్ 367లో మూడెకరాల భూమి ఉన్నట్టుగా నకిలీ ముద్రలు ఉపయోగించి నకిలీ పాస్‌పుస్తకం తయారు చేసి ఇచ్చాడు.
కాశీరామ్ దండుగుల కనుకయ్యకు రెండేండ్ల క్రితం చూపించిన భూమిలో వారం క్రితం సాగు చేస్తుండగా అటవీ అధికారులు వచ్చి అడ్డుకున్నాడు. దీంతో కనుకయ్య కాశీరామ్‌కు విషయం చెప్పగా తనకు సంబంధం లేదని దాట వేశాడు. డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరించాడు. గత జనవరిలో.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ధరణిలో మార్పులు చేస్తున్నారని నమ్మించి మరో రూ.20 వేలు ఇస్తే ధరణిలో నమోదు చేయిస్తానని నమ్మబలికాడు. ఇలా పలువురికి నకిలీ పట్టా పాస్ బుక్‌లు తయారు చేసి ఇచ్చి నగదు దండుకున్నాడు.
బాధితుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్సై ఆంజనేయులు కాశీరామ్‌ను ఆరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతుల పట్టాదారు పాస్‌బుక్‌లు 10, 6 టైటీల్ డీడీ బుక్‌లు ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.