కరీంనగర్ కలెక్టరేట్, మే 22: తెలంగాణ సర్కారుతో సఖ్యతగా ఉన్నప్పుడే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని టీఎన్జీవోస్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. ఇదే తరహాలో ఇప్పటివరకు అనేక డిమాండ్లను నెరవేర్చుకున్నామని చెప్పా రు. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లకు పేస్కేల్ ఇప్పించిన ఘనత టీఎన్జీవోస్కే దక్కిందని అన్నారు. వీఆర్వోలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఇతర శాఖల్లో సర్దుబాటు, తాజాగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధ్దీకరణకు హామీ లభించడంలో కీలక భూమిక పోషించినట్టు తెలిపారు. సోమవారం కరీంనగర్లో టీఎన్జీవోస్ జిల్లా శాఖ ఆధ్వర్యం లో రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్‌ను ఘనంగా సత్కరించారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లాకు చేరుకున్న వీరికి సంఘం బాధ్యులు బైక్‌ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం టీఎన్జీవోస్ భవన్లో ఆత్మీయ సన్మానం చేశా రు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడు తూ.. సీపీఎస్ రద్దు విషయమై సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే ప్రకటన వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పీఆర్సీ, ఈహెచ్ఎస్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. సీపీఎస్ అమలు బాధ్యతను కేంద్రం రాష్ర్టాలకు అప్పగించిందని అన్నారు. 2004 నుంచి ఉద్యోగులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేస్తున్న 20 శాతం కంట్రిబ్యూషన్‌ను వెంటనే చెల్లించకపోతే కేంద్రంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు.