కమాన్ చౌరస్తా, మార్చి 6: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ మామిడికుంట చెరువు మత్తడి నాలా (Nala Encroachment) క్రమక్రమంగా కబ్జాకు గురవుతోంది. గతంలో చెరువులోకి ఎంత వరద వస్తే అంతే వరద బయటకు వెళ్లగా, నేటి పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. చెరువు కిందున్న నాలాను ఆనుకొని పలు వెంచర్లు ఉండగా, చెరువు నీరు వెళ్లే నాలాను సైతం తమ సొంత భూమి అని కొందరు వ్యక్తులు కూల్చుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం నాలా పూర్తిగా కబ్జా గురువుతుంది. అయితే, నాలా అంతా కబ్జా అవుతుండగా, వరద చెరువు నుంచి బయటికి వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో స్థానిక కాలనీలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో ఆక్రమణలు గురువుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
20 నుంచి రెండు ఫీట్ల దాకా..
అయితే మామిడికుంట మత్తడి దొరికే క్రమంలో నాలా 20 నుంచి 25 ఫీట్ల వరకు ఉంది. ఆ నాలా వరంగల్ రూట్ హైవేకు చేదుకునే వరకు కేవలం రెండు ఫీట్ల వెడల్పుగా మారిపోయింది. ఈ విషయమై పలుమార్లు ముదిరాజ్ సంఘం నాయకులు, స్థానిక పలు కాలనీలకు చెందిన వాసులు, అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయినా భూమిని అధికారులు తమ విభాగం కాదు అంటే తమ విభాగం కాదు అంటూ చేతులు దులుపుకుంటున్నారు.
వారం రోజులుగా వరుస కథనాలు…
మామిడికుంట నాలా కబ్జాకు గురవుతున్న క్రమంలో వారం రోజులుగా వివిధ పత్రికలు, మాధ్యమాలలో వరుసగా కథనాలు ప్రచురితం అవుతున్నాయి. ఈ క్రమంలో ముదిరాజ్ కులస్తులు, స్థానిక కాలనీ వాసులు ఇప్పటికే పలమార్లు ప్రజాప్రతినితులు , అధికారులను సంప్రదించారు. ఎలక్షన్ కోడ్ ఉందంటూ అధికారులు ఫోన్లో కూడా రెస్పాండ్ కాకపోవడం, ఇరిగేషన్ అధికారులు మేము ఈ విషయమై మున్సిపల్ రెవెన్యూ అధికారులకు నివేదికలు పంపా మంటూ చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఒక్క అధికారి కూడా సైట్ దగ్గరగా విసిట్ చేసి కబ్జాదారులను మందలించిన దాఖలాలు లేవు. ఈ విషయంలో అధికారులకు ముడుపులు ముట్టాయా అంటూ స్థానికులు గుసగుసలాడుతున్నారు. ఇలాంటి అధికారులు ఉంటే అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.