హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్‌లో భారీ కుంభకోణం జరిగిందా? పోస్టుకు ఇంత చొప్పున అమ్ముకున్నారా? కొంత మంది ఎంపికచేసిన వారిని ఒకే గదిలో పెట్టి పరీక్ష రాయించారా? తమకు కావాల్సిన వారికి ఇష్టారీతిన మార్కులు వేశారా? అంటే ఫలితాలను బట్టి చూస్తే అలాగే అనిపిస్తున్నది. గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ జాబితా (జీఆర్ఎల్)ను పరిశీలిస్తే అనేక లొసుగులు వెలుగు చూస్తున్నాయి. గ్రూప్-1 టాపర్లంతా ఒకే గదిలో పరీక్ష రాసినట్టు వెల్లడవుతున్నది. 500కు పైగా మార్కులొచ్చిన వారంతా ఒకే గదిలో పరీక్ష రాసిన వారిగా తేలతెల్లమైంది. మెరిట్ మార్కులు, హాల్‌టికెట్ నంబర్లను పరిశీలిస్తే ఒకే గదిలో పరీక్ష రాసిన వారికి ఒకటి రెండు తేడాలతో మార్కులు ఉండటం గమనార్హం. టాపర్లుగా నిలిచిన ముగ్గురు అభ్యర్థులు ఒకే గదిలో పరీక్ష రాశారని ఇతర అభ్యర్థులు గగ్గో లు పెడుతున్నారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిందని, మొత్తంగా గ్రూప్-1లో భారీ స్కామ్ జరిగిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ కుంభకోణం వెనుక ప్రభుత్వ పెద్ద ల హస్తం ఉన్నదని, ఈ కుంభకోణంపై జ్యుడీషియల్ విచారణ జరపాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
రెండు నంబర్ల తేడాతో సేమ్ మార్కులు
టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 జీఆర్ఎల్ చూస్తే వరుసపెట్టి మార్కులేశారా? అన్న అనుమానం కలుగుతున్నది. ప్రతి రెండు హాల్‌టికెట్ నంబర్లకు సేమ్ మార్కులు వేశారు. రెండు హాల్‌టికెట్ నంబర్ల తేడాతో 44 మంది కి ఒకే మార్కులు రావడం గమనార్హం. వీరం తా మెరిట్ జాబితాలోనే ఉన్నారు. ఎన్ని కోణా ల్లో చూసినా ఇలా ఉండటానికి ఆస్కారమే లేదు. కానీ ఇదంతా ఒక పద్ధతి ప్రకారం ఉండటం గమనార్హం. 370 వరకు మార్కులొస్తే గ్రూప్-1 ఉద్యోగాలొస్తాయన్న అంచనాలు ఉన్నాయి. కావాలనే ఇలా పేపర్లును శాస్త్రీయంగా దిద్దకుండా ఇష్టారీతిన కొంతమందికి పోస్టులు కట్టబెట్టడంలో భాగంగా మార్కులు వేశారని ఆరోపిస్తున్నారు.
వరుసపెట్టి మార్కులేశారిలా!
ఒక పరీక్ష కేంద్రంలో ‘366(చివరి నంబర్లు) హాల్‌టికెట్ నంబర్ గల అభ్యర్థికి 436 మార్కులు, ముందు అభ్యర్థి (హాల్‌టికెట్ నంబర్ 367)కి 438 మార్కులు వచ్చా యి. మరో చోట 732 నంబర్ గల అభ్యర్థికి 425 మార్కులు, 733 నంబర్‌కు 425.5 మార్కులు.. ఇలా ఒకరి తర్వాత మరొకరు పరీక్ష రాస్తే 0.5 మార్కులు తేడాతో వేశారు. వరుసగా హాల్‌టికెట్ నంబర్లు, వరుసపెట్టి మార్కులు. ముందు బెంచీ వాళ్లకు వచ్చిన మార్కులకు, తర్వాత బెంచీ వాళ్లకు ఒకటి లేదా రెండు మార్కుల తేడాలతో వచ్చాయి. ఇదంతా చూస్తుంటే నిజంగా గ్రూప్-1 మెయి న్స్ ఆన్సర్ షీట్లు మూల్యాంకనం చేశారా? లేక వరుసపెట్టి మార్కులు వేశారా? యావరేజ్‌గా హాల్‌టికెట్ నంబర్లను బట్టి మార్కులు వేసుకుంటూ పోయారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పేపర్లు మూల్యాంకనం ఎంత లోపభూయిష్టంగా జరిగిందో ఈ ఉదాహరణే నిదర్శనంగా నిలుస్తున్నది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. దాదాపు 360 మంది అభ్యర్థులకు ఇలాగే జరిగింది.
రెండు నెలల్లోనే పూర్తి
గ్రూప్-1 మెయిన్స్‌ను 21 వేల మంది రాశారు. ఒక్కో అభ్యర్థి 7 పేపర్లకు పరీక్షలు రాశారు. అంటే 1.47 లక్షల సమాధాన పత్రా లు ఉంటాయి. జవాబు పత్రాలను ఇద్దరు వాల్యుయేటర్ల చేత మూల్యాంకనం చేయించారు. ఇద్దరు మూల్యాంకనం చేసిన తర్వాత మార్కుల్లో 15 శాతం తేడాలు ఉంటే మూడోసారి మూల్యాంకనం చేస్తారు. గతంలో ఏపీ లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ మూ ల్యాంకనానికి మూడు నెలలు పట్టింది. అప్పట్లో అభ్యర్థులు 6 వేల మందే. కానీ ఇప్పుడు 21 వేల మంది పేపర్ల మూల్యాంకనం రెండు నెలల్లోనే పూర్తి అయ్యింది. ఇది ఎలా సాధ్యమని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇష్టారీతిన మార్కులేసి, ప్రతిభావంతులకు అన్యాయం చేశారని మండిపడుతున్నారు.
ఆన్సర్ షీట్లు బయటపెట్టండి
గ్రూప్-1లో రోజుకో బాగోతం వెలుగుచూస్తుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నాది. బాధితులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మెయిన్స్ ఆన్సర్ షీట్లను ఆన్లైన్లో పొందుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే అసలు విషయం భయపడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయని పక్షంలో అక్రమాలు జరిగినట్లు టీజీపీఎస్సీ ఒప్పకున్నట్టేనని అంటున్నారు.
నేడు మరో సమావేశం
గ్రూప్-1పై భవిష్యత్తు కార్యచరణ కోసం నిరుద్యోగ జేఏసీ నేతలు మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో భేటీ అయ్యారు. మూల్యాంకనంలో లోపాలపై, అభ్యర్థులకు జరుగుతున్న నష్టంపై ఈ సమావేశంలో చర్చించారు. బుధవారం చిక్కడపల్లిలోని శ్రీత్యాగరాయగానసభలో మరో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పోటీ పరీక్షల శిక్షకులు పీ అశోక్, ప్రసన్న హరికృష్ణ, తెలంగాణ ఉద్యమకారుడు విఠల్ తదితరులను ఆహ్వానించారు.