హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టీజీ జెన్కో అధికారులను ఆదేశించారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు అనువుగా ఉన్న 23 ప్రాంతాల్లో సాధ్యాసాధ్యాలపై నివేదికలు సమర్పించాలని సూచించారు. ఆదివారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల వద్ద ట్రాన్స్‌కో, జెన్కో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జూరాల నుంచి పులిచింతల వరకు ఉన్న హైడల్ విద్యుత్తు ప్లాంట్లల్లో విద్యుత్తు ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కన్సల్టెంట్ల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. పగలు సోలార్, రాత్రివేళ ఇతర మార్గాల ద్వారా విద్యుత్తును అందించే ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
రాబోయే తరాల సంక్షేమం కోసం పర్యావరణహిత విద్యుత్తును ఉత్పత్తిచేయాలని, డిమాండ్‌ను బట్టి 20 ఏండ్లకు సరిపడా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గ్రీన్ హైడ్రోజన్, ప్లోటింగ్ సోలార్, రూఫ్‌టాప్ సోలార్, థర్మల్, పవన విద్యుత్తు, అణువిద్యుత్తు, బ్యాటరీ స్టోరేజీ వంటి ప్రత్యామ్నాయ విద్యుత్తు ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని చెప్పారు. సీఎండీ నుంచి సిబ్బంది వరకు సాంకేతికను పెంపొందించుకునేందుకు మూడు రోజులపాటు శిక్షణ ఇవ్వాలని, అందుకు ఈ అవసరమైన సిలబస్‌ను రూపొందించాలని సూచించారు.