హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ‘ఏసీ కార్యాలయంలో కూర్చుని ఫైళ్లను క్లియర్ చేయడం అవసరమే. కానీ అదే మానవ సంబంధాలకు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోండి’ అని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సివిల్ సర్వెంట్లకు హితవు పలికారు. ‘ఈ ప్రాంగణాన్ని మీరు జ్ఞానం, ఆత్మవిశ్వాసం, ఆశతో విడిచిపెడుతున్నారు. ఇకమీకు అవసరమయ్యేది వివేచన, వినయం, నైతిక ధైర్యం’ అని వ్యాఖ్యానించారు. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో గురువారం జరిగిన ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్ అధికారుల 10 వారాల శిక్షణ ముగింపు కార్యక్రమంలో భట్టి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిజాయితీతో సేవ చేయాలని, ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవాలని, సానుభూతితో నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. ప్రజలు మిమ్మల్ని ఒక అధికారిగా మాత్రమే కాకుండా ప్రజాసేవకుడిగా గుర్తుపెట్టుకోవడం ద్వారానే సివిల్ సర్వీసెస్ హోదాకు న్యాయం చేయగలరని పేర్కొన్నారు. ‘మీ పని ద్వారా ఎవరి జీవితంలో అయినా ఒక మంచి మార్పు, గౌరవాన్ని తీసుకువచ్చారా అని ప్రతిరోజూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి? అవును అనే సమాధానం వస్తే ఆ రోజుకు మీరు విజయం సాధించినట్టే’ అని ఉద్బోధించారు.
‘ఈ దేశం మీ నుంచి కేవలం పర్ఫెక్షన్ను మాత్రమే ఆశించడం లేదు… అంతకంటే ఎకువగా మీరు చేసే పనిలో సిన్సియారిటీని కూడా కోరుకుంటున్నది’ అని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. గవర్నెన్స్ అంటే కేవలం ఫైళ్లు, నిబంధనలు కాదని, అది ప్రజలతో మమేకమయ్యే ఒక హ్యూమన్ రిలేషన్ అని బోధించారు. నిర్ణయాలు తీసుకునే సమయంలో సమాజంలోని చిట్టచివరి వ్యక్తిని, నిరుపేదల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ప్రజాసేవలో బాహ్య ఒత్తిళ్ల కంటే అహంకారం, ఉదాసీనత, అవినీతి లాంటి అంతర్గత బలహీనతలే ప్రమాదకరమని హెచ్చరించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ స్వీయ నియంత్రణ పాటిస్తూనే.. నిజాయితీ, వినమ్రత, ధైర్యం కోల్పోవద్దని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పౌరసేవలు ప్రజల ముంగిటకు చేరాలంటే టెక్నాలజీ వినియోగం అత్యవసరమని అన్నారు. సాంకేతికత ప్రజలకు చేరువగా ఉండాలి కానీ భయపెట్టేలా ఉండకూడదని సూచించారు. పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే ‘గుడ్ గవర్నెన్స్’ సాధ్యమవుతుందని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేయాలని చెప్పారు.