హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): కంచ గచ్చిబౌలిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి, వన్యప్రాణులను చంపుతున్నదన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తప్పుబట్టారు. తెలంగాణ గురించి మోదీ ఎందుకు అలా మాట్లాడారో తెలియదని చెప్పారు. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లను నరకలేదని, జంతువులను చంపలేదని తెలిపారు. అడవులను పెంచి ప్రకృతిని కాపాడటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని, వాస్తవాలను కోర్టుకు తెలియజేస్తామని చెప్పారు. కంచ గచ్చిబౌలిలో అటవీభూమి లేదని, ఆ భూముల్లో వివిధ సంస్థలు ఉన్నాయని వివరించారు.
భూములపై మాట్లాడే అర్హత మోదీకి లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు. మోదీ ఎన్నికల ర్యాలీల కోసం బీజేపీ లక్షల చెట్లను నరికివేసిందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో చేస్తున్న విధ్వంసాలు, చెట్ల నరికివేతలు ప్రధానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. హెచ్‌సీయూలో అనుమతులు లేని 5 భవనాలను ప్రధాని ప్రారంభించారని తెలిపారు. చెట్లను నరకడం బీజేపీ సంస్కృతి అని మండిపడ్డారు. కంచ గచ్చిబౌలి భూములపై మోదీ వాస్తవాలకు దూరంగా మాట్లాడారని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. హరియాణా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని విడగొట్టేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. ప్రధాని అన్ని రాష్ర్టాల మధ్య సమాఖ్య స్పూర్తితో ఉండాలని హితవు పలికారు.
సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడారోనని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. కంచె గచ్చిబౌలిలో అటవీభూమి లేదని, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలను కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలను బద్నాం చేయకూడదని మోదీకి హితవు పలికారు. కంచ గచ్చిబౌలిలో తామేమీ పర్యావరణ విధ్వంసం చేయడంలేదని, అడవులను నరికామని, జంతువులను చంపామని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. రాష్ట్రంలో అడవులను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.