చేర్యాల, డిసెంబర్ 13 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 10.45 గంటలకు క్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాం గణంలోని తోట బావి వద్ద గల కల్యాణ వేదికలో మహోత్సవాన్ని నిర్వహిస్తారు. రెండు రోజులపాటు జరిగే ఈ వేడుకకు రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ టంకశాల వెంకటేశ్ ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణ ఆహ్వాన పత్రికలను దాతలు, భక్తులకు పంపిణీ చేశారు. స్వామి వారి మహోత్సవాన్ని కనులారా చూసి తరించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.