హైదరాబాద్, జూలై 4(నమస్తేతెలంగాణ): నలుగురైదుగురు కలిసి గ్రూపులు కడితే భయపడేవారు ఎవరూ లేరని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను తాను గానీ, రాహుల్ అసలు పట్టించుకోమని తేల్చి చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించిన ఖర్గే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కే రోశయ్య జయంతి సందర్భంగా లక్డీకాపూల్ మెట్రోస్టేషన్ సమీపంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎల్బీస్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభలో పాల్గొన్నారు. అనంతరం గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ), అడ్వయిజరీ కమిటీల సంయుక్త సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేలా పనిచేయాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు ఇష్టానుసారం మాట్లాడొద్దని, పార్టీ ఆదేశాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని సూచించారు. కొందరు పార్టీ ఎమ్మెల్యేల తీరుపట్ల ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ 11 ఏండ్ల పాలన ఎమర్జెన్సీ కంటే ఎక్కువని విమర్శించారు. రాజకీయాల్లో రోశయ్య చెరగని ముద్రవేశారని ఖర్గే పేర్కొన్నారు. ఆయనకు సరైన గౌరవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా జయంతి వేడుకలను నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీచేసిందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో నిష్ట, నిబద్ధతకు రోశయ్య ఓ ఉదాహరణ అని మల్లికార్జునఖర్గే అన్నారు.
మోదీ విదేశాంగ విధానం సరిగా లేదని, తప్పుడు విధానంతో అందరినీ శత్రువులుగా మార్చుకుంటున్నారని ఖర్గే మండిపడ్డారు. మోదీ ప్రధాని అయ్యాక గత 11 ఏండ్లలో తెలంగాణకు ఏం తెచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ కులగణన దేశానికే ఓ రోల్ మోడల్ కొనియాడారు. ఇప్పటికి మోదీ 42 దేశాలు తిరిగారని, కానీ మణిపూర్ వెళ్లడానికి మాత్రం ఆయనకు మసను రావట్లేదని నిలదీశారు. పాకిస్థాన్‌ను ఏదేదో చేస్తామని ప్రగల్భాలు పలికి యుద్ధాన్ని మధ్యలోనే ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. ‘జై బాపు’, ‘జై భీమ్’, ‘జై సంవిధాన్’ పేరుతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లాలని పిలునిచ్చారు.
కొందరు నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, వారి ప్రతి కదలికను ప్రజలు గమనిస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నట్టు కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నాయి. పార్టీ నేతలు, మంత్రులు ఆచితూచి వ్యవహరించాలని, నాయకుల వ్యవహార శైలితో పార్టీకి నష్టం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించినట్టు తెలిసింది. ప్రభుత్వంతో పాటు పార్టీలో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నెల 30 లోపు భర్తీ చేయాలని టార్గెట్ పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కలగజేసుకుని ఇంచార్జి మంత్రులు బాధ్యత తీసుకొవాలని సూచించినట్టు సమాచారం.
పార్టీ పదవులతోనే గుర్తింపు, గౌరవం వస్తుందని, అది రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి జనగణనలో కులగణన చేసేలా విజయం సాధించామని అన్నారు. యూత్‌కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో చాలామందికి ప్రభుత్వంలో పదవులు వచ్చాయని చెప్పారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయని తెలిపారు. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వచ్చే పదేండ్లు కాంగ్రెస్‌దే అధికారం అని చెప్పారు.
ఖర్గే హెచ్చరించిన గ్రూప్ రాజకీయాల మీద కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. పార్టీలో ఇప్పటి వరకు మూడు వర్గ పోరులు బయటికి వచ్చాయి. ఒక మంత్రిని లక్ష్యంగా చేసుకొని ఒక యువ ఎమ్మెల్యే నేతృత్వంలో పదిమంది ఎమ్మెల్యేలు విందు రాజకీయంతో గ్రూప్ కట్టినట్టు పార్టీలో కలకలం రేగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐటీసీ కోహినూర్ హోటల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గ్రూప్‌గా ఏర్పడి రహస్యంగా సమావేశమైనట్టు ప్రచారం జరిగింది. అనంతరం సదరు ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చి ఒక మంత్రిని ఉద్దేశించి 30 పర్సంట్ మంత్రిగా, అవినీతి మంత్రిగా పేర్కొన్నారు. మంత్రి వర్గ విస్తరణ సమయంలో కొందరు దళిత ఎమ్మెల్యేలు ఒక హోటల్లో రహస్యంగా సమావేశమయ్యారు. తమ సామాజిక వర్గం నేతలకు మంత్రి పదవి ఇవ్వకుంటే సహించేది లేదని పార్టీ అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ దంపతులు ఒక వైపు, మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర నేతలు అంతా ఒక వైపు అన్నట్టుగా గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ మూడు గ్రూపుల్లో ఏ గ్రూప్‌ను ఖర్గే హెచ్చరించి ఉంటారనే చర్చ జరుగుతున్నది.