హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): తన పదవికి ప్రధాన పోటీదారుల్లో ఉన్న ‘బాంబుల’ మంత్రికి ముఖ్యనేత వర్గం చెక్ పెట్టినట్టేనా? స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై ఆ మంత్రి చెసిన ప్రకటనలను ముఖ్యనేత తిరుగులేని అస్త్రంగా మలుచుకున్నారా? తెలంగాణలో చంద్రబాబు కోవర్టులున్నారంటూ జడ్చర్ల ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం వెనుక లక్ష్యం సదరు మంత్రేనా? మొత్తంగా మాట నిలకడలేని వ్యక్తిగా, కోవర్టుగా ముద్ర వేసి అధిష్ఠానం ముందు ఆయన ఇజ్జత్‌ను బర్బాద్ చేశారా? మొత్తంగా పార్టీలో, ప్రభుత్వంలో ‘నంబర్ టూ’గా ఎదిగినంత వేగంగా ఆయన్ను తిరిగి పెవిలియన్‌కు పంపేస్తున్నారా? ప్రస్తుతం కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం కాంగ్రెస్ వర్గాల నుంచే వస్తున్నది.
శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ), అడ్వయిజరీ కమిటీల సంయుక్త సమావేశం ఆ మంత్రి టార్గెట్‌గానే సాగినట్టు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన హెచ్చరికలు కొన్ని ఆయనను ఉద్దేశించినవే అనే చర్చ జరుగుతున్నది. ఈ దెబ్బతో రెండో వికెట్ డౌన్ అంటూ ముఖ్యనేత వర్గం సంబురాలు చేసుకుంటున్నదని గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు మంత్రితో వ్యక్తిగతంగా విభేదాలేవీ లేనప్పటికీ ముఖ్యనేత ఆయనను రాజకీయ పోటీదారుగా భావిస్తున్నారని, పార్టీలో పరపతి తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ‘నమస్తే తెలంగాణ’ ఇటీవలే కథనం ప్రచురించింది. ఇదే తరహాలో తాజా పరిణామాలు జరగడం విశేషం.
బలమైన ఆర్థిక శక్తిగా ఉన్న ఆ మంత్రి, భవిష్యత్తులో తమకు ముప్పుగా మారబోతున్నట్టు ముఖ్యనేత వర్గం మొదటి నుంచే కీడు శంకించినట్టు కాంగ్రెస్ వర్గాలే బహిరంగంగానే చెప్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సదరు నేత పార్టీకి ఆర్థిక వెన్నెముకగా నిలబడ్డారనే ప్రచారంలో ఉన్నది. దక్షిణ తెలంగాణ జిల్లాల అభ్యర్ధుల ఎంపికలో కీలకంగా వ్యవహరించారని, దాదాపు 30 నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులకు ఆయన ఫండింగ్ చేశారని అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యనేత ఆయనకు మొదట్లో ప్రాధాన్యం ఇచ్చారని చెప్పుకుంటున్నారు. కానీ ఆ మంత్రి వ్యవహార శైలిని చూసి భవిష్యత్తులో రాజకీయ పోటీదారుగా వస్తారని ముఖ్యనేత భావించారని పేర్కొంటున్నారు. దీంతో ఆయనను బలహీనపరిచేందుకు సఖ్యతతో మెదులుతూనే అవినీతిని ప్రోత్సహించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
రామచంద్రాపురం, కుత్బుల్లాపూర్, పటాన్చెరు, గచ్చిబౌలి, అమీన్పూర్ తదితర ప్రాంతాల్లో మంత్రి నేరుగా జోక్యం చేసుకొని భూములు కబ్జా పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని వెలమల బిల్లదాఖల భూముల్లో, పటాన్చెరు మండలం సుల్తాన్‌పూర్‌లోని సర్వే నంబర్ 30లోని ప్రభుత్వ భూములు, గచ్చిబౌలిలోని 100 ఎకరాల టీజీఐఐసీ భూము ల్లో సదరు మంత్రి ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యనేత ఓవైపు నుంచి అవినీతిని ప్రోత్సహించి, వివాదాస్పద, ప్రభుత్వ భూముల కబ్జాలు, 22ఏ భూముల సెటిల్మెంట్లు చేయించి, మరోవైపు నిఘా వర్గాలను ఉసిగొల్పి అధికారిక నివేదిక లు తెప్పించుకున్నట్టు విశ్వసనీయవర్గాల స మాచారం. ఈ నివేదికల్లో ఒక కాపీని అధిష్ఠానానికి, మరో కాపీని తన అనుచర ఎమ్మెల్యేల బ్యాచ్‌కు ఇచ్చినట్టు చర్చ జరుగుతున్నది.
ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు చెందిన 8 మంది యువ ఎమ్మెల్యేలతో ఒక బ్యాచ్‌ను ఏ ర్పాటుచేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ బ్యాచ్ ఎమ్మెల్యేలే తరుచూ సదరు మంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. గతంలో ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన శాసన సభాపక్షం సమావేశంలో ఓ యువ ఎమ్మెల్యే ఫైళ్లు పట్టుకొని హల్చల్ చేయడం ప్రణాళికలో భాగమే అంటున్నారు. అప్పుడే మంత్రి అవినీతిని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లగలిగారని, తెరవెనుక ముఖ్యనేత ఉండే ఇదంతా చేయించారని పార్టీ లో చర్చ జరిగింది. దీంతో ఆ మంత్రి సచివాలయానికి, నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయినట్టు పేర్కొంటున్నారు. అయినా ఇటీవల ఓ యువ ఎమ్మెల్యే ఆ మంత్రిని ల క్ష్యంగా చేసుకొని ‘కోవర్టు’ అంటూ ఆరోపణలు చేశారని చెప్తున్నారు.
సదరు మంత్రి ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై ఓ ప్రకటన చేశారు. జూన్ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతున్నదంటూ మీడియాకు చెప్పారు. నోటిఫికేషన్ కంటే ముందే రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తామని కూడా వెల్లడించారు. గతంలోనూ ఆయన పలుమార్లు ప్రభుత్వ నిర్ణయాలను ముందే మీడియాకు లీకులు ఇవ్వడంతో ముఖ్యనేత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఎన్నికలపై ప్రకటన చేయడంతో ఈ వ్యాఖ్యలను ముఖ్యనేత అవకాశంగా మలుచుకొని రాజకీయంగా చక్రం తిప్పినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలపై మహిళా మంత్రి కూడా లీకులు ఇచ్చారు. కానీ ఆమెను తప్పించి, బాంబుల మంత్రినే ముఖ్యనేత టార్గెట్ చేశారన్న ప్రచారం జరుగుతన్నది. మొత్తం అంశాన్ని ఆయన మెడకే చుట్టినట్టు చెప్తున్నారు. ఇందుకు మొదట టీపీసీసీ చీఫ్‌తో హెచ్చరికలు చేయించారు. ఆయన ప్రకటనల వీడియో క్లిప్పింగులను అధిష్ఠానానికి కూడా పంపినట్టు తెలిసింది. రాహుల్‌గాంధీ మానస పుత్రికగా చెప్పబడుతున్న, కు ల గణనలో కీలకమైన 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే మంత్రి తొందరపడి ప్రకటన చేశారని, ఇది పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉన్నదని ఆధిష్ఠాన పెద్దలకు నూరిపోసినట్టు ప్రచారం జరుగుతున్నది.
అధిష్ఠానంలో ముఖ్యనేతకు అనుకూలంగా ఉండే ఓ నేత ఈ అంశాన్ని తీవ్రమైన నేరంగా కాంగ్రెస్ పెద్దల ముందు ఎత్తి చూపారని సమాచారం. ఈ నేపథ్యంలోనే పార్టీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శుక్రవారం జరిగిన సమావేశంలో సదరు మంత్రిని తీవ్రంగా హెచ్చరించినట్టు తెలిసింది. పీఏసీ సభలోనూ ఆయన్ను ఉద్దేశిస్తూ.. మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతామంటే పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారనే ప్రచారం జరుగుతున్నది.