Kargil War | రామచంద్రాపురం, మే 8 : తాను పెండ్లయిన రెండు రోజులకే విధుల్లో చేరినట్టు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌కు చెందిన రిటైర్డ్ ఆర్మీ సోల్జర్ మల్లేపల్లి రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఆర్మీలో 14 ఏండ్లపాటు సేవలందించినట్టు చెప్పారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో మల్లేపల్లి రాజేందర్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘1993లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ఆర్మీ ట్రైనింగ్‌లో చేరా. విధుల్లో భాగంగా పంజాబ్‌లోని పెరోజ్పూర్ బార్డర్లో పనిచేశా. 1999లో ఇండియా-పాకిస్థాన్‌కు మధ్య కార్గిల్ యుద్ధం వచ్చింది.
ఆ సమయంలో బార్డర్లోనే ఉండి సేవలు అందించిన. అనంతరం ఉగ్రవాదులు భారత పార్లమెంట్‌పై 2001లో దాడులు చేశారు. దానికి అనుగుణంగా ఆర్మీ ఆపరేషన్ పరాక్రమ్ తీసువచ్చింది. ఆ సమయంలోనే 2002 మే 24న నాకు వివాహం జరిగింది. ఆర్మీ నుంచి పిలుపు రావడంతో వివాహం జరిగిన రెండు రోజులకే బార్డర్‌కు వెళ్లిన. ఆపరేషన్ పరాక్రమ్ దాదాపుగా 45 రోజులపాటు సాగింది. ఆపరేషన్ పరాక్రమ్‌లో భాగంగా పంజాబ్, పాకిస్థాన్ బార్డర్ పెరోజ్పూర్లో విధులు నిర్వహించిన. 14 ఏండ్లపాటు ఆర్మీలో సేవలు అందించిన. కంటి సమస్య కారణంగా రిటైర్ అయినట్టు’ రాజేందర్‌రెడ్డి తెలిపారు.