జగిత్యాల రూరల్, మే 2: తన భూమిని కొందరు ఆక్రమించడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. పొరండ్ల గ్రామానికి చెందిన పడిగెల మల్లారెడ్డి (45)కి పోచమ్మ ఆలయం వద్ద ఎకరంన్నర భూమి ఉన్నది. ఏప్రిల్ 27న మల్లారెడ్డి తన భూమిని చదును చేయడానికి వెళ్లగా.. గంగారెడ్డి, జనార్దన్‌రెడ్డి, రాజిరెడ్డి, రాజవ్వ, రమ, లచ్చవ్వ అనే ఆరుగురు అక్కడికి వచ్చి ఈ భూమి తమదని, మరోసారి ఇక్కడికి వస్తే చంపేస్తామని బెదిరించడంతో మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే కరీంనగర్‌లోని ఓ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. భూ ఆక్రమణ విషయమై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు నిరసన తెలిపారు. 20 ఏండ్ల నుంచి వారికి భూతగాదాలు ఉన్నాయని, ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి తెలిపారు. మల్లారెడ్డి భార్య అనూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జగిత్యాల రూరల్ పోలీసులు తెలిపారు.