MP Dharmapuri Arvind | మల్లాపూర్, జూలై 17: ‘అర్విందన్నా.. మీరు నిజామాబాద్ ఎంపీగా ఎందుకు గెలిచిండ్రన్నా? కార్యకర్తలు, రైతుల కోసం ఏంజేసిండ్రు మీరు? తెలంగాణకు బీజేపీ ఏం ఇచ్చింది? చేసిందేంటో పార్లమెంట్లో చెప్పకపోతిరి’.. అంటూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి దేశెట్టి కిరణ్ సూటిగా ప్రశ్నించారు. కిరణ్ సోమవారం మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ఆ పార్టీలో కలకలం రేపింది. కిరణ్ మాటల్లోనే.. ‘అర్వింద్ అన్నా.. ఏఉద్దేశం కోసం గెలిచారు? కార్యకర్తల కోసం కరెక్ట్‌గా పనిచేయలేదు. కనీసం రైతుల కోసం పనిచేయలేకపోతున్నారు. ఇటీవల జరిగిన ఓ ఎన్నికల సర్వేలో అసలు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పలేని దయనీయస్థితిలో ఉన్నది.
రైతులంతా ఒక్కటై కవితపై పోటీచేసిన మిమ్మల్ని ఎంపీగా గెలిపించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 20 మంది ఎంపీటీసీలు గెలిచారు. మీరు ఎంపీగా గెలిచి గిన్ని రోజులైనా వీరికి ఎన్ని నిధులు ఇచ్చారు? మా ఊరు రాఘవపేట.. స్థానిక కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సొంతూరైనప్పటికీ ఆయనకు వ్యతిరేకంగా, సొంతంగా ఖర్చుపెట్టుకొని కొట్లాడినం. కేసుల నమోదై జైలుకు పోయినం. కేసులు నమోదైన బీజేపీ కార్యకర్తల పేర్లు మీకు తెలుసా? కనీసం మమ్మల్ని పలకరించారా? ప్రజలు కరెక్ట్‌గా ఉన్నారు. నాయకుడిగా, ఓ ఎంపీగా మీరు ఫెయిల్ అయ్యారు. నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలను ఎందుకు పోత్సహిస్తున్నావో అర్థం కావడం లేదు’ అని కిరణ్ పేర్కొన్నారు. కాగా, ఈ వీడియోను బీజేపీ నాయకులే సోషల్ మీడియాలో వైరల్ చేయడం గమనార్హం.