హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో న్యాయవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్-2026లో పురుష అభ్యర్థులు సత్తాచాటారు. 74.42% మంది అర్హత సాధించారు. మహిళలు 70.08% మంది క్వాలిఫై అయ్యారు. మూడేండ్ల ఎల్ఎల్బీ కోర్సులో ఏపీలోని విజయనగరం జిల్లా ఆత్మరాముని అగ్రహారం గ్రామానికి చెందిన మీసాల విజయదుర్గ 150 మార్కులకు 94.31 మార్కులతో టాపర్‌గా నిలిచారు. ఐదేండ్ల ఎల్ఎల్బీ కోర్సులో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసరకు చెందిన ఏ సనిత్రెడ్డి, ఎల్ఎల్ఎంలో రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన శేగూరి నిశిత ప్రథమస్థానం సాధించారు.
మూడేండ్ల కోర్సులో టాపర్ మినహా తొలి పదిస్థానాల్లో 9 మంది పురుషు లు నిలువడం గమనార్హం. హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్న త విద్యామండలి చైర్మన్ జీ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ కుమార్ గురువారం ఫలితాలు విడుదల చేశారు. మూడేండ్ల, ఐదేండ్ల ఎల్ఎల్బీ కోర్సులతోపాటు పీజీస్థాయి ఎల్ఎల్ఎం కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యం లో మే 18న పరీక్ష నిర్వహించారు. న్యాయవిద్య కోర్సులకు 66,864 మంది రిజిస్టర్ చేసుకున్నారు.
వీరిలో 54,374 మంది పరీక్ష రాయగా 39,673 మంది(72.96%) అర్హత సాధించారు. మూడేండ్ల కోర్సులకు 47,573 మంది దరఖాస్తు చేసుకోగా, 38,261 మంది పరీక్షలు రాశారు. వీరిలో 29,327 (76.65%)మంది అర్హత సాధించారు. ఐదేం డ్ల లా కోర్సులకు 14,077 మంది దరఖాస్తు చేసుకోగా, 11,520 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 6,073 (52.72%) మంది క్వాలిఫై అయ్యారు. అలాగే పీజీస్థాయి ఎల్ఎల్ఎం కోర్సులకు 5,214 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. 4,593 మంది పరీక్ష రాశారు. 4,273 మంది (93.03%) అర్హత సాధించారు.