కరీంనగర్ కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 10: ప్రముఖ కవి, రచయిత, చరిత్రకారుడు, శతాధిక గ్రంథకర్త, విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ మలయశ్రీ (ఎస్ మల్లయ్య) అస్తమించారు. తెలుగు సాహిత్యరంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించి, తన రచనల ద్వారా సమాజంలో చైతన్యం కలిగించిన ఆయన, కొంతకాలంగా వయోభారంతో బాధపడుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. విషయం తెలియడంతో కళాకారులు, సాహితీవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కరీంనగర్ రేకుర్తి సమీప వేమన నగర్‌లోని ఇంటికి వచ్చి నివాళులర్పించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్లకు చెందిన మలయశ్రీ 1940లో జన్మించారు. ఎంఏ, ఎంవోఎల్, పీహెచ్డీ చేసిన ఆయన.. ప్రభుత్వ తెలుగు టీచర్, లెక్చరర్‌గా పనిచేశారు. కరీంనగర్ శివారు వేమననగర్లో స్థిరపడ్డారు. తెలుగు భాషా సాహిత్యంపై మక్కువతో అనేక గ్రంథాలు, పుస్తకాలు రాశారు.
పీహెచ్‌డీలో భాగంగా ‘కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర’ అనే అంశంపై పరిశోధన చేసి 1995లో డాక్టరేట్ అందుకున్నారు. క్రీ.శ.946 నుంచి 1995 వరకు కరీంనగర్ జిల్లా వెయ్యేండ్ల సాహిత్య చరిత్రపై లోతుగా పరిశోధించి, అక్షరీకరించారు. గంగాధర మండలం కురిక్యాల బొమ్మలమ్మ గుట్టపై క్రీ.శ. 946 కాలపు జినవల్లభుని త్రిభాషా శాసనంలోని మూడు కంద పద్యాలే తెలుగు సాహిత్యంలో మొదటివనీ, కందం పుట్టింది కరీంనగర్ జిల్లాలోననీ, మలయశ్రీనే తొలిసారి వెలుగులోకి తెచ్చారు. పోతన రచనగా భావించిన ‘నారాయణ శతకం’ రాసింది ‘వెలగందుల నారయ’ అని మలయశ్రీ నిరూపించారు. ‘శ్రీకృష్ణ శతకం’ రచించింది మన ధర్మపురి కాకుత్సం రామాజు కవి అని సాక్ష్యాధారాలతో తేల్చిచెప్పారు. కవిగా తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. తన కవితలు, పద్యాలతో రాష్ట్ర ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. బహుప్రక్రియల బహుగ్రంథకర్తగా గుర్తింపు పొందిన ఆయన, వందకు పైగా గ్రంథాలు, పుస్తకాలు రాశారు.