హైదరాబాద్, మే 9: మలయాళ సినిమా ‘పడ’లో కలెక్టర్ కిడ్నాప్ కథలోని నిజ జీవిత పాత్ర.. రిటైర్డ్ ఐఏఎస్ డబ్ల్యూఆర్ రెడ్డిదే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని నార్సింగి లో నివాసం ఉంటున్నారు. 1996లో అయ్యంకాళి పడ అతివాద ఉద్యమకారులు ఆయనను బందీగా చేసుకొని హడలెత్తించారు. దీని ఆధారంగానే పడ సినిమా వచ్చింది. ఈ సందర్భంగా డబ్ల్యూఆర్ రెడ్డిని పలుకరించగా.. నాటి వాస్తవ సంఘటనను వివరించారు. అది 1996 అక్టోబర్ 4.. నలుగురు అతివాదులు పాలక్కడ్ కలెక్టరేట్‌కు ఫిర్యాదుదారుల్లాగే వచ్చా రు. తుపాకీ, డైనమైట్లు చూపించి, సిబ్బందిని బెదిరించి కలెక్టర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. కేరళ ప్రభుత్వం ఆదివాసీ బిల్లును వెనక్కి తీసుకోవాలన్నది వాళ్ల డిమాండ్. తొమ్మిది గంటల పాటు హైడ్రామా నడిచింది.
చివరికి ప్రభుత్వ హామీ మీద కలెక్టర్‌ను విడిచిపెట్టేందుకు ఒప్పుకొన్నారు. వాళ్లు బయటికి వచ్చిన తరువాత మీడియాతో తాము బొమ్మ తుపాకీ, వైర్‌తో చుట్టిన పైప్‌ను డైనమైట్ అంటూ బెదిరించామని చెప్పారు. అది నిజం కాదు. వాళ్లు నిజమైన తుపాకీతోనే వచ్చారు. వాళ్ల దగ్గర బాం బులు ఉన్నాయి. అది అమ్మోనియం నైట్రేట్ అయ్యుండొచ్చు. ఒక బాంబ్ కూడా పేల్చారు. కానీ, తాము తెచ్చినవి బొమ్మ తుపాకీలని మీడియా ముందు చెప్పారు. ఆ తర్వాత వాళ్ల బ్యాగులను ఎవ్వరూ చెక్ చేయలేదు. ఆ సమయంలో అక్కడ జర్నలిజం ఘోరంగా విఫలమైంది. కొందరు రాజకీయ నాయకులు ఘటనను పూర్తిగా వక్రీకరించారు. నేను వరంగల్ నుంచి వచ్చానని, మావోయిస్టులతో నాకు లింక్ ఉన్నదని ఆరోపించారు. నాది కర్నూలు. పైఅధికారులు నా వివరణ కోరారు.
నాకది క్రూరమైన సమయం’ అని డబ్ల్యూఆర్ రెడ్డి నాటి సంగతులు గుర్తు చేసుకొన్నారు. ఘటన తర్వాత ఆయనను కొల్లాంకు బదిలీ చేశారు. వివిధ హోదాల్లో కేరళలోనే పనిచేసి అడిషనల్ చీఫ్ సెక్రటరీ అయ్యారు. ఎన్ఐఆర్డీ డైరెక్టర్‌గా హైదరాబాద్‌కు బదిలీ అయ్యి ఈ మధ్యే రిటైర్ అయ్యారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖకు చెందిన నేషనల్ కెపాసిటీ బిల్డింగ్ ఫ్రేమ్‌వర్క్ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా పడ సినిమాపై స్పందించిన డబ్ల్యూఆర్ రెడ్డి.. సినిమాను 99.9 శాతం వాస్తవ అంశాలతో చిత్రీకరించారని, తన పాత్రలో అర్జున్ రాధాకృష్ణన్ బాగా చేశారని పేర్కొన్నారు.