ఖైరతాబాద్, డిసెంబర్ 6 : మాలమాదిగలు మనువాదం, మౌఢ్యం, వర్ణవ్యవస్థ, కర్మసిద్ధాంతాన్ని రూపుమాపి మానవతత్వంతో మెలగాలని ఎమ్మెల్సీ, కవి, గాయకుడు గోరంటి వెంకన్న సూచించారు. దళిత ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత వర్గాలు జ్ఞానపరమైన సమాజమని, వారి మధ్య విద్వేషాలు తగవని పేర్కొన్నా రు. మాలమాదిగల్లో ఎందరో మహానుభావులు ఉన్నారని, వర్గీకరణ విషయంలో ప్రజాస్వామికవాదులు, మానవీయ దృక్పథం ఉన్నవారు అన్ని సంఘాలను భాగస్వామ్యం చేసి ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
దళిత ఇంటలెక్చువల్ ఫోరం ప్రతినిధి డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు తాము వ్యతిరేకం కాదని, కొందరు మాలలను మనువాదులు అనడం సరికాదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర అన్ని వర్గాల్లో మనువాదులు ఉన్నారని, ఏకపక్షంగా ఒక కులాన్ని టార్గెట్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ కుమారస్వామి, ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.