పూడూరు, ఆగస్టు 4 : వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ సిగ్నల్ కేంద్రం ఏర్పాటు యోచనను విరమించుకోవాలని ఏఐకేఎంఎస్, పీవోడబ్ల్యూ, పీడీఎస్యూ కమిటీల సభ్యులు మహేందర్, శ్రీనివాస్, గీత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఆదివారం పూడూరులో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నేవీ రాడార్ సిగ్నల్ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మక్కువ చూపిస్తున్నదని ప్రశ్నించారు. రాడార్ ఏర్పాటుతో పశుపక్షాదులు, మానవ మనుగడకు ముప్పు ఏర్పడుతుందని చెప్పారు. స్థానికుల కోరిక మేరకు ఈ ప్రాజెక్టును విరమించుకోవాలని డిమాండ్ చేశారు.