హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ టీ వర్క్స్‌లో శనివారం మేకర్ ఫెయిర్ అట్టహాసంగా ప్రారంభమైంది. దేశంలో అతి పెద్ద భౌతిక వస్తువుల నమూనాల తయారీ కేంద్రంగా గుర్తింపు పొందిన టీ వర్క్స్‌లో త్రీడీ ప్రింటింగ్, కుండల తయారీ, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్.. ఇలా రకరకాల అంశాల్లో సరికొత్త ఆవిష్కరణలు రూపొదించే వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే కార్యక్రమాన్ని టీ వర్స్ చేపట్టింది.
దేశంలోనే ఎంతో ప్రతిష్ఠాత్మక కార్యక్రమంగా నిర్వహిస్తున్న మేకర్ ఫెయిర్‌లో 500 మందికిపైగా ఔత్సాహిక తయారీదారులు పాల్గొని వివిధ అంశాల్లో కొత్త వస్తువుల నమూనాలను రూపొందించినట్టు టీ వర్క్స్ ప్రతినిధి వీర చప్పీ తెలిపారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ఎన్నో ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుస్తున్నదని, తెలంగాణ నుంచే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది ఇందులో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ఆదివారం కూడా ఈ ఫెయిర్ ఉంటుందని, కొత్త వస్తువుల తయారీపై ఔత్సాహికులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని ఆయన పేర్కొన్నారు.