వెల్గటూర్/ధర్మపురి రూరల్, ఏప్రిల్ 11: ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతి గ్రామం నుంచి 20 మంది చొప్పున.. నియోజకవర్గం నుంచి 5వేల మందితో వెళ్లి విజయవంతం చేద్దామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా, కొప్పుల ముఖ్య అతిథిగా హాజరై ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వై ఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో ఈ నెల 27న ఉదయం పార్టీ జెండాను ఆవిష్కరించి, ఆ తర్వాత బహిరంగ సభకు బయలుదేరాలని సూచించారు. కాంగ్రెస్ పాలన రాష్ట్ర ఏర్పాటుకు ముందు న్న రోజులను గుర్తు చేస్తున్నదని జడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత విమర్శించారు.
స్వచ్ఛందంగా తరలిరావాలి ; రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి
కొల్లపూర్ రూరల్, ఏప్రిల్ 11 : ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీరం మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు ప్రజలను తరలించేందుకు చర్య లు తీసుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులతో కలిసి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
రజతోత్సవ సభకు తరలిరావాలి ;కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
మద్దూర్, ఏప్రిల్ 11 : ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కొడంగల్ నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మద్దూరులో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి మద్దూర్, కొత్తపల్లి, గుండుమాల్ మండలాల బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించగా నరేందర్‌రెడ్డి హాజరై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఫూలే జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మద్దూర్, కొత్తపల్లి బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు వంచర్ల గోపాల్, మధుసూదన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ఎల్కతుర్తి సభకు దండు కట్టాలి ; 27న గ్రామాల్లో గులాబీ జెండాలు రెపరెపలాడాలి
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ భద్రాచలం, ఏప్రిల్ 11: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భద్రాద్రి జిల్లా నుంచి గులాబీ శ్రేణులు దండు కట్టాలని, ఆ రోజు గ్రామగ్రామాన గులాబీ జెండాలు రెపరెపలాడాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. శుక్రవారం భద్రాచలంలో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. నియోజకవర్గ శ్రేణులు శ్రమించి ఇక్కడి వ్యక్తిని పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరారని విమర్శించారు. అనంతరం కొత్తగూడెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రజల్లో పరువు పోగొట్టుకుంటున్నదని విమర్శించారు. రజతోత్సవ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, కొత్తగూడెం మాజీ ఎమ్మె ల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.