హైదరాబాద్, జనవరి7 (నమస్తే తెలంగాణ): వ్యాపారానికి అనువైన వాతావరణాన్ని సృష్టించి వాణిజ్యాన్ని సులభతరం చేయడం (ఈవోడీబీ)లో రాష్ట్రం జోరుగా ముందుకు సాగుతున్నది. గతంలో ఈవోడీబీ ర్యాంకుల్లో మూడో స్థానంలో నిలిచిన తెలంగాణ.. ఈ ఏడాది అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ మేరకు ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సత్వర సేవలు అందించగలితే ఈవోడీబీ ర్యాంకుల్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని పేర్కొంటూ.. ఆ దిశగా కృషిచేయాలని సూచించారు. వివిధ శాఖల పనితీరుపై అంతర్గత అధ్యయనం నిర్వహించి అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. సులభతర వాణిజ్య సంస్కరణలను మరింత సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ (ఎస్ఆర్ఏపీ)ని రూపొందించి, ఇప్పటికే 26 విభాగాల్లో 301 సంస్కరణలను అమలు చేస్తున్నది. వీటిపై ప్రజలతోపాటు వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకొంటున్నది.
2019లో ఇచ్చిన ఈవోడీబీ గ్రేడ్లను పరిశీలిస్తే.. భవన నిర్మాణాలకు డీటీసీపీ, జీహెచ్ఎంసీ 96 శాతానికిపైగా సత్వర అనుమతులిచ్చాయి. ఈ ప్రక్రియ ఆన్లైన్లో జరుగుతున్నప్పటికీ కొంత మంది నిర్మాణదారులు స్వయంగా కార్యాలయాలకే వచ్చి అనుమతులు తీసుకొంటున్నారు. నిర్మాణ అనుమతులతోపాటు ట్రేడ్ లైసెన్సుల జారీ, క్రమబద్ధీకరణ, జలమండలి, సీడీఎంఏలో నీటి కనెక్షన్లు, బిల్లుల చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఫ్యాక్టరీలు, బాయిలర్స్ శాఖలలో 100% సంస్కరణలు అమలవుతున్నాయి. కార్మికశాఖలోని ఐదు విభాగాల్లో పూర్తిగా ఆన్లైన్ ప్రక్రియ అమలవుతున్నది. టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రమలకు 30 రోజుల్లోనే అనుమతులు, ప్రోత్సాహకాలు ఇస్తుండటం, నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తుండటం, అత్యున్నత మౌలిక వసతులు కల్పించడంతో పారిశ్రామికవేత్తలు తెలంగాణకు క్యూ కడుతున్నారు.