OU PhD | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ప్రవేశ ప్రక్రియ నోటిఫికేషన్లో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ సంఘాల విద్యార్థి నాయకులు ఓయూ పరిపాలన భవనంలోని వైస్ ఛాన్స్లర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. యూనివర్సిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో ఈ మార్పులు తప్పనిసరిగా చేయాలని కోరారు. రిటైర్ అయిన ప్రొఫెసర్లకు సైతం గైడ్ షిప్ అవకాశం కల్పించాలని కోరారు. పీహెచ్డీ సీట్ల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. వివిధ రీసెర్చ్ సెంటర్లు, పీజీ సెంటర్ల రిటైర్డ్ ప్రొఫెసర్లకు సైతం గైడ్ షిప్ ను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రవేశ పరీక్షలో ర్యాంకు విధానాన్ని ఎత్తివేసి అర్హత సాధించిన అందర్నీ ఇంటర్వ్యూకు పిలవాలని డిమాండ్ చేశారు.