హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా కోర్సుల్లో చేరే విద్యార్థుల్లో అత్యధికులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకే జై కొడుతున్నారు. సర్కార్ కాలేజీల్లోనే అడ్మిషన్లు పొందుతున్నారు. ఈ ఏడాది పాలిసెట్ సీట్ల భర్తీలో ఇదే ట్రెండ్ కనిపించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో రికార్డుస్థాయిలో 92% సీట్లు నిండాయి. అదే ప్రైవేట్ కాలేజీల్లో 58% సీట్లు మాత్రమే నిండాయి. ప్రభుత్వ కాలేజీల్లో మంచి వసతులుండటం, ల్యాబ్లు, నిపుణులైన ఫ్యాకల్టీ ఉండటంతో ప్రైవేట్ కాలేజీలను కాదని ప్రభుత్వ కాలేజీల్లోనే చేరుతున్నారు. పాలిసెట్ మొదటి విడత సీట్లను ఆదివారం కేటాయించారు. మొత్తం 112 కాలేజీల్లో 32వేలకు పైగా సీట్లుండగా, 25వేలు సీట్లు నిండాయి. వీటిలో 16వేలకుపైగా సీట్లు ప్రభుత్వ కాలేజీల్లోనివే కావడం గమనార్హం. బ్రాంచీలవారీగా తీసుకుంటే సీఎస్ఈలోనే అత్యధిక సీట్లు నిండాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 9లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. సోమవారం నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. ఈ నెల 8 నుంచి 12 వరకు విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించనున్నట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు.
