సంగారెడ్డి, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఎన్నికల వ్యూహాలు ఫలిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్న హరీశ్‌రావు రాజకీయ ఎత్తుగడలకు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు చిత్తవుతున్నాయి. మంత్రి హరీశ్‌రావు చొరవతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్ బీఆర్ఎస్లో చేరారు. గురువారం నర్సాపూర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో గాలి అనిల్‌కుమార్ గులాబీ కండువా కప్పుకున్నారు.
బీజేపీ రాష్ట్ర నాయకులు, పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల నేతలు గడీల శ్రీకాంత్, రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే కూడా బీఆర్ఎస్లో చేరారు. ఒకేరోజు కాంగ్రెస్, బీజేపీకి చెందిన ముగ్గురు కీలక నేతలు కారెక్కడంతో సంగారెడ్డి, పటాన్చెరులో బీఆర్ఎస్కు మరింత బలం చేకూరనున్నది. సంగారెడ్డి జిల్లాలో ఇటీవలే సదాశివపేటకు చెందిన బీజేపీ ముఖ్యనేత శివరాజ్‌పాటిల్, నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత విజయపాల్‌రెడ్డి సైతం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే.