హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతున్నదా? అసమర్థ, అవినీతి ముద్రతో ఒక దళిత, ఇద్దరు బీసీ మంత్రులను బయటికి పంపే ప్రయత్నాలు జరుగుతున్నయా? ముఖ్యమంత్రి శిబిరం ఇప్పటికే దళిత మంత్రి మీద ఒత్తిడి తెస్తున్నదా? స్పీకర్ మార్పు నుంచి కీలక శాఖల పునర్విభజన వరకు ఏఐసీసీ కసరత్తు చేస్తున్నదా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిపాలనా తీరును పదే పదే విమర్శించే అగ్రవర్ణ సామాజిక వర్గ నేతకు మంత్రి పదవి ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందా? ఆయనకు మంత్రి పదవి ఇస్తే, తన శాఖను మార్చడంతోపాటు తన భార్యకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాల్సిందేనని అదే జిల్లా అగ్రవర్ణ సామాజిక వర్గానికే చెందిన సీనియర్ మంత్రి పట్టుబడుతున్నారా? ఈసారి ప్రక్షాళనలో నలుగురు మంత్రులకు ఉద్వాసన తప్పదా? అంటే ఇటీవల గాంధీభవన్ నుంచి ఢిల్లీ అధిష్ఠానం దాకా సాగుతున్న తాజా రాజకీయ పరిణామాలు ‘అవును’ అనే సంకేతాలే ఇస్తున్నాయి.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మొదలుపెట్టాలని ఏఐసీసీ ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 1,000 రోజులు పూర్తయిన నేపథ్యంలో మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు చేపట్టేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రుల్లో దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్, బీసీ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, మరో మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రివర్గం నుంచి తప్పిస్తారని, వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తారని సీఎం అనుకూల శిబిరం లీకులు వదులుతున్నది. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా కొనసాగుతున్న వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకొని, ఆయన స్థానంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను స్పీకర్‌గా ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. స్పీకర్ పదవిని స్వీకరించాలని ఇప్పటికే మంత్రి అడ్లూరి మీద సీఎం శిబిరం తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్నది.
మరో బీసీ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు సీఎం శిబిరం ఢిల్లీలో చెమటలు కక్కుతున్నట్టు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నది. సురేఖను మంత్రివర్గం నుంచి గెంటేయాలని ఢిల్లీపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మంత్రి కుమార్తె ప్రభుత్వ పెద్దపై ఆరోపణలు చేసినా.. చర్యలు లేకుంటే ఇక ఎవరినీ కంట్రోల్ చేయలేమని సీఎం శిబిరం ఆందోళనతో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా సీఎంకు ప్రధాన ప్రతిబంధకంగా మారుతున్న సీనియర్ మంత్రులను ఏమాత్రం కట్టడి చేయలేమని, సురేఖ మీద వేటు వేసి తమను విమర్శించే వారికి బలమైన హెచ్చరికలు పంపాలని సీఎం శిబిరం భావిస్తున్నట్టు తెలిసింది.
ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి కొండా సురేఖ శాఖల్లో ఆమె కుమార్తె చొరబడిన తీరు, బదిలీలు, అనుమతుల విషయంలో ఆమె ప్రమేయానికి సంబంధించిన ఆధారాలను అందజేసినట్టు తెలిసింది. గతంలో సినీ నటుడు అక్కినేని కుటుంబం మీద చేసిన ఆరోపణల తాలూకు వీడియో క్లిప్పింగ్‌లు, కోర్టు కేసు వ్యవహారాలు, మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం అంతా కేసీ వేణుగోపాల్ ముందు పెట్టినట్టు తెలిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావును కూడా తప్పించేందుకు సీఎం శిబిరం పట్టుబడుతున్నట్టు తెలిసింది.
కీలక ఆదాయ వనరుగా మారిన ఎక్సైజ్ శాఖలో ఇద్దరు ప్రముఖల మధ్య విభేదాలు పొడచూపినట్టు ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో సోంబీర్ల అనుమతి వివాదాస్పదమైన నాటి నుంచే జూపల్లి మంత్రి పదవి ఊస్టు అనే ఊహాగానాలు వస్తున్నాయి. జూపల్లి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ప్రేమ్‌సాగర్‌రావును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమారతోపాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలిసింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో చోటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన రామ్మోహన్‌రెడ్డి కుటుంబం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిసి మంత్రి పదవి ఇవ్వాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించినట్టు కథనాలు వచ్చాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలన్న ఆలోచనలో ఈ ఇద్దరి పేర్లూ ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయని తెలుస్తున్నది. వీరి ఆశలకు నల్లగొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రధాన ప్రతిబంధకంగా ఉన్నట్టు చెప్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డిని పక్కనపెట్టి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. గతంలో పార్టీ అధినాయకత్వం తనకు ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వవచ్చనే ప్రచారం జరుగుతున్నది. రాజగోపాల్‌రెడ్డిని మంత్రిని చేస్తే, తన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతికి కూడా అమాత్య పదవి ఇవ్వాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గతంలోనే పార్టీ పెద్దలను కలిసినప్పుడు డిమాండ్ చేశారు. రాజగోపాల్‌రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకుంటే పద్మావతికి డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని, అదే సమయంలో రామ్మోహన్‌రెడ్డికి చీఫ్ విప్ పదవి దకవచ్చని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విషయంలోనూ కీలక మార్పు ఉండవచ్చని ప్రచారం జరుగుతున్నది. పొన్నంను తప్పించాలని సీఎం శిబిరం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. కొంతకాలంగా పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రితో విభేదిస్తున్నారని, ఇటీవల కొండా సురేఖ వివాదంలో ఆయన పరోక్షంగా సురేఖకు మద్దతుగా మాట్లాడారని, అలాగే ఇటీవల సీఎం సోదరుల కంపెనీకి కేటాయించిన భూముల వివాదంపై ప్రెస్‌మీట్ పెట్టాలని సీఎంవో చేసిన సూచనను తోసిపుచ్చారని కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్నది.
ఈ నేపథ్యంలోనే సీఎం శిబిరం పొన్నంకు ఎసరు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. అయితే, పొన్నం ప్రభాకర్‌ను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు అధిష్ఠానం ససేమిరా అంటున్నట్టు తెలిసింది. ఆయన స్థానంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ప్రతిపాదనను సీఎం శిబిరం అధిష్ఠానం ముందు పెట్టినట్టు చెప్తున్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రభుత్వంతోపాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లోనూ ఒకేసారి మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉన్నదని చెప్తున్నారు.
ప్రస్తుతం పరిశ్రమల శాఖను నిర్వహిస్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఆ శాఖ స్థానంలో ఆర్థిక శాఖను అప్పగించాలని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మొత్తం మంత్రివర్గంలో శ్రీధర్‌బాబు ఒకరికే ఆయన ఏ శాఖ కోరితే ఆ శాఖను అప్పగించేందుకు అధిష్ఠానం సిద్ధంగా ఉన్నదని సమాచారం. దీంతో రాబోయే పునర్వ్యవస్థీకరణలో శాఖల మార్పులపై ఆయన అభిప్రాయానికి ప్రత్యేక ప్రాధాన్యం దకవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన వద్ద ఉన్న నీటిపారుదల శాఖను తొలగించి, రెవెన్యూ శాఖ ఇవ్వాలని అధిష్ఠానాన్ని అభ్యర్థిస్తూ వస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై 40% కమీషన్ ఆరోపణలు రావడంతో పాటు 22-ఏ వివాదంలో ఆయన పూర్తిగా ఇరుక్కున్నారనే ఆరోపణల నేపథ్యంలో శాఖ మార్పు చర్చకు మరింత ఊతమిచ్చింది. ఈ నేపథ్యంలో పొంగులేటిని రెవెన్యూ శాఖ నుంచి తప్పించి ఆ శాఖను ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి గానీ, మరొకరికి గానీ అప్పగించే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పరిస్థితులు మరింత మారితే పొంగులేటిని మంత్రి పదవి నుంచే తప్పించే అంశంపై కూడా చర్చ జరుగుతున్నట్టు సమాచారం.
ఒకవేళ రెవెన్యూ శాఖను తొలగిస్తే తనకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ (ఎంఏయూడీ)ను అప్పగించాలని పొంగులేటి పట్టుబడుతున్నారని తెలిసింది. ఆ కీలక శాఖను వదులుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా లేరని సమాచారం. దీంతో రెవెన్యూ, నీటిపారుదల, పరిశ్రమలు, పురపాలక శాఖలతోపాటు ఇతర కీలక శాఖల బాధ్యతల్లోనూ మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉన్నదన్న చర్చ సాగుతున్నది.