కరీంనగర్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : బ్యాంకుల ద్వారా మ్యూల్ అకౌంట్లు తెరుస్తూ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న భారీ నెట్‌వర్క్‌ను కరీంనగర్ సైబర్ పోలీసులు ఛేదించారు. ప్రాథమిక దర్యాప్తులోనే రూ.138.06 కోట్లు ఈ అకౌంట్ల ద్వారా లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఇదంతా ఒకే బ్యాంకు నుంచి జరగడం కలకలం రేపుతున్నది. ఇందుకు సహకరించిన ఆర్బీఎల్ బ్యాంక్ మేనేజర్, క్యాషియర్‌తోపాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేరగాళ్లకు, ఖాతాదారులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న కొందరు మ్యూల్ అకౌంట్లు తెరుస్తున్నారని సీపీ గౌష్ ఆలం శుక్రవారం తెలిపారు. వీరికి కొందరు బ్యాంక్ అధికారులు కూడా సహకరిస్తున్నారని చెప్పారు. ఫిర్యాదు మేరకు ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0 పేరిట దర్యాప్తు ప్రారంభించామని, కరీంనగర్ జిల్లా కేంద్రం కిసాన్‌నగర్‌లోని ఆర్బీఎల్ బ్యాంక్‌లో కొందరి ఖాతాలను పరిశీలించగా పెద్ద మొత్తంలో సైబర్ నేరాలు జరిగినట్టు వెల్లడైందని తెలిపారు.
జగిత్యాల జిల్లా వెల్గటూరుకు చెందిన బండారి సాయిరాం, బుగ్గారం మండలం గోపులాపురానికి చెందిన అనుమాండ్ల రంజిత్, జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన బోగ రాకేశ్, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన అలిగేటి మల్లేశం, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరకు చెందిన బండి ప్రవీణ్ మధ్య వర్తులుగా వ్యవహరించారని, సైబర్ నేరగాళ్లు వీరి ఖాతాలను కూడా విరివిగా ఉపయోగిస్తున్నట్టు వెల్లడైందని తెలిపారు. వీరితోపాటు పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన విభూది రాంకుమార్, జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌కు చెందిన నతర్ల శ్రీనివాస్, జగిత్యాలకు చెందిన కల్లెడ మహేందర్, కోండ్ర నరహరి, కల్లెడ రాకేశ్, వరంగల్‌కు చెందిన కర్రె రాజును కూడా అరెస్టు చేశామని వెల్లడించారు.
తమ ఖాతాల్లో నగదు జమ చేసుకునేందుకు వీరు సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నట్టు పేర్కొన్నారు. వర్చువల్‌గా సేవిం గ్, కరెంట్ అకౌంట్లు తెరిచేందుకు సహకరించిన ఆర్బీఎల్ కిసాన్‌నగర్ బ్రాంచ్ బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్న వరంగల్‌కు చెందిన భువనగిరి కళ్యాణ్, కరీంనగర్‌కు చెందిన క్యాషియర్ ఆయేషా బేగంను అరెస్టు చేసి, బీఎన్ఎస్ సెక్షన్ 112, 318(4), ఐటీ యాక్ట్ సెక్షన్ 66-డీ కింద కేసులు నమోదు చేసినట్టు సీపీ వెల్లడించారు. కొద్దిపాటి కమీషన్ కోసం ఆశపడి సైబర్ నేరగాళ్లకు సహకరించవద్దని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.