మెట్పల్లి : మక్క పంట చేతికొచ్చినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై జగిత్యాల జిల్లా రైతుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అన్నదాతలు కదం తొక్కారు. శుక్రవారం మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ తీస్తూ.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. 63వ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. క్వింటాల్ మక్కలకు మద్దతు ధర రూ.2,400 ఉండగా మార్కెట్లో రూ.1800 పలుకుతున్నదని, దళారుల చేతిలో నష్టపోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నల్ల రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, మద్దతు ధరతో మక్కలను కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు ఐక్యవేదిక జిల్లా నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి, మారు మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ యాసంగి సీజన్‌కు సంబంధించి సన్న వడ్లకు బోనస్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని, వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని, రూ.2 లక్షలు రుణమాఫీ కాని రైతులకు వెంటనే మాఫీ చేయాలని కోరారు. అనంతరం ఆర్డీవో శ్రీనివాస్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.