హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, దీనిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, హౌస్ కమిటీ వేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ మేరకు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ఫీనిక్స్ గ్రూప్ కంపెనీల నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో సంబంధాలున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ తదితర సంస్థలకు సుమారు రూ.15వేల కోట్ల విలువైన భూములు, ఆస్తుల బదిలీలు అక్రమంగా జరిగాయని ఏలేటి ఆరోపించారు. ఈ భూ లావాదేవీలకు సంబంధించి దాదాపు 102 షెల్ కంపెనీల పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు.
కమీషన్లు, సెటిల్మెంట్ల కోసమే రైతులతోపాటు ప్రైవేట్ యజమానుల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. 22ఏను ‘కలెక్షన్ సెక్షన్’లా మార్చారని విమర్శించారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ కేంద్ర దర్యాప్తు సంస్థలతోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి లేఖ రూపంలో పంపుతానని ఏలేటి స్పష్టంచేశారు.