– గుంతలమయం రుద్రంపూర్, గౌతంపూర్ రహదారులు
రుద్రంపూర్, అక్టోబర్ 03 : సింగరేణి కొత్తగూడెం ఏరియా సివిల్ అధికారులు పైప్‌లైన్ పనుల కోసం రహదారులను తవ్వి పనులు పూర్తిచేసినా.. తిరిగి రోడ్లకు మరమ్మతులు చేపట్టకపోవడంతో రుద్రంపూర్, గౌతంపూర్ కార్మిక కాలనీల ప్రజలు కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురైన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇటీవల నిర్వహించిన గ్రామసభలో ప్రజలు తమ ఇబ్బందులను రుద్రంపూర్ సర్పంచ్ బానోత్ కేస్లీ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యపై స్పందించిన సర్పంచ్ వెంటనే గుంతలను పూడ్చే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం రహదారులకు ఇరువైపులా కంకరతో కూడిన గ్రావెల్ పోసి గుంతలను పూడ్చే పనులను పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టారు.
సర్పంచ్ బానోత్ కేస్లీ, పంచాయతీ కార్యదర్శి నరేందర్, ఉప సర్పంచ్ తోటరాజు దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. వార్డు సభ్యుడు శ్రీనివాస్‌తో పాటు పంచాయతీ సిబ్బంది పనుల్లో పాల్గొన్నారు. కొంతకాలంగా గుంతల రోడ్లతో నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పంచాయతీ చేపట్టిన చర్యలతో తాత్కాలిక ఉపశమనం లభించనుంది. సమస్యను గుర్తించి వెంటనే స్పందించిన సర్పంచ్, పంచాయతీ సిబ్బందికి కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అయితే పైప్‌లైన్ పనులు పూర్తయిన నేపథ్యంలో రహదారులకు శాశ్వత మరమ్మతులు చేపట్టి సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.