మాక్లూర్, అక్టోబర్ 27: నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సోదరుడు, ఎన్నారై బిగాల మహేశ్ గుప్తా భూరి విరాళంతో నిర్మించిన అధునాతన పాఠశాల అందుబాటులోకి వచ్చింది. తండ్రి బిగాల కృష్ణమూర్తి, తాత బిగాల గంగారాం స్మారకార్థం నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌లో నిర్మించిన ఈ పాఠశాలను రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి బిగాల సోదరులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యకు పెద్దపీట వేశారని కొనియాడారు. పాఠశాలకు కేసీఆర్ రూ.4.70 కోట్లు మంజూరు చేయగా, బిగాల సోదరులు రూ.కోటి విరాళం ఇచ్చినట్టు తెలిపారు. అప్పటి సీఎం కేసీఆర్ హయాంలోనే విద్యాభివృద్ధి చెందిందని, 10 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి, 10 వేల మంది వైద్యులను తీర్చిదిద్దినట్టు కొనియాడారు.
ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ మాత్రమే విద్యాభివృద్ధికి కృషి చేశారని, 1100 గురుకులాలను ఏర్పాటు చేసి ఎంతో మందికి విద్యావకాశాలు కల్పించినట్టు చెప్పారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ పిలుపుతో బిగాల సోదరులు ముందుకొచ్చి కళాశాల నిర్మించడం ద్వారా జన్మభూమి రుణం తీర్చుకున్నారని కొనియాడారు. సంపాదించిన దాంట్లో సమాజ సేవ కోసం ఖర్చు చేయడం గొప్ప వ్యక్తిత్వమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ప్రశంసించారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా మాట్లాడుతూ.. గ్రామంలో తండ్రి పేరిట ఉన్నత పాఠశాల, తాత పేరుతో ప్రాథమికోన్నత పాఠశాల నిర్మించడం ఆనందంగా ఉన్నదని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్‌ను ఒప్పించి పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం తరపున రూ.4.70 కోట్లు మంజూరు చేయించినట్టు తెలిపారు. బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కన్వీనర్ బిగాల మహేశ్ మాట్లాడుతూ.. తాను అమెరికాలో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్ అమెరికాలో జరిగిన ఎన్ఆర్ఐల సభలో గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని, దత్తత తీసుకోవాలని సూచించారని తెలిపారు. కేటీఆర్ స్ఫూర్తితోనే గ్రామంలోని పాఠశాలను దత్తత తీసుకుని కొత్త పాఠశాల భవనానికి రూ.కోటి విరాళం అందించినట్టు పేర్కొన్నారు.