హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబురాలను అమెరికాలోని డాలస్‌లో నిర్వహించడం చారిత్రాత్మకమని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల కొనియాడారు. దేశం బయట ఇంత పెద్ద సభ నిర్వహించడం కేవలం బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమైందని తెలిపారు. డాలస్‌లోని డాక్టర్ పెప్పర్ ఎరీనా ప్రాంగణంలో అట్టహాసంగా మొదలైన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మహేశ్ బిగాల మాట్లాడుతూ ‘ఇది రజతోత్సవ సంబురం మాత్రమే కాదు. కేటీఆర్‌కు డాలస్ ఆత్మీయ స్వాగతం. కేసీఆర్‌కు ఆత్మీయ ఆహ్వానం. డాలస్ మీ కోసం ఎదురు చూస్తున్నదని కేసీఆర్‌ను మేము ఈ వేదిక ద్వారా కోరుతున్నాం. డాలస్ వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని ఆయనను కోరుతున్నాం’ అని చెప్పారు.
సరిగ్గా 25 ఏండ్ల క్రితం ఆత్మగౌరవ పతాకగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. 14 ఏండ్లపాటు రాష్ట్ర సాధన కోసం వీరోచితంగా పోరాడిన బీఆర్ఎస్ తెలంగాణను సాధించిదని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నారైలు కీలక పాత్ర పోషించారని తెలిపారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిలోనూ ఎన్నారైలు కీలక భూమిక పోషించారని వివరించారు. డాలస్‌లో ఇంతపెద్ద వేడుకలు జరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైల దృష్టి డాలస్పై పడిందని చెప్పారు. ఇతర దేశాల్లో నివసిస్తున్న వారు తమ ప్రాంతాల్లో కూడా ఇలాంటి వేడుకలు నిర్వహించాలని కోరుతున్నారని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కళాకారులు, ఇతర ప్రముఖులకు మహేశ్ బిగాల కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ముఖ్య నేతల హాజరు
అమెరికాలోని డాలస్‌లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ, తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణలోని పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు, ఎందరో ఎన్నారై శాఖల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సంబురాల్లో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి, ఎల్ రమణ, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నోముల భగత్, గాదరి కిశోర్, రసమయి బాలకిషన్, కోరుకంటి చందర్, గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, చంటి క్రాంతికిరణ్, జాన్సన్ నాయక్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, నాయకులు రంగినేని అభిలాశ్, బీఆర్ఎస్ ఎన్నారై యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మహేశ్ తన్నీరు, బీఆర్ఎస్ డాలస్ ఇన్చార్జి శ్రీనివాస్ తుర్కంటి, ఎన్నారై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ నాగులవంచ నర్సింహారావు, పార్టీ నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, గండ్ర జ్యోతి, కొణతం దిలీప్, శివకుమార్, మూల విజయారెడ్డి రావు కల్వల తదితరులు పాల్గొన్నారు.