కండ్లముందే పంటలన్నీ ఎండిపోవట్టే.. బోర్లలో నీళ్లన్నీ ఇంకిపోవట్టే.. బోరుబాయిల్లో మోటర్లన్నీ కాలిపోవట్టే.. రిపేర్లు, పంట పెట్టుబడికి చేసిన అప్పులు పెరిగిపోవట్టే.. ఇంకేం చేస్తం? సర్కారైనా సాయం చేస్తదా? అంటే అదీ లేదాయే. ఇక, మరణమే శరణ్యం అనుకున్నారు ఆ ఇద్దరు యువరైతులు. తీవ్ర మనస్తాపానికి గురై ఉరికొయ్యకు వేలాడారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతానికి చెందిన బాంచ మహేందర్(35), పాలమూరు జిల్లా మద్దిగట్ల గ్రామంలో కొత్తకుర్వ శ్రీశైలం(30) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నర్సాపూర్, ఏప్రిల్ 6: నాలుగు బోర్లున్నయ్.. మస్తుగ నీళ్లు పోస్తయని రెండెకరాల్లో పంట వేశాడా రైతు. పెట్టుబడి కోసం అప్పు కూడా తెచ్చాడు. కానీ, లోవోల్టేజీతో మూడు సార్లు మోటర్లు కాలిపోయాయ్.. బోర్లలో నీళ్లు తగ్గి పంటంతా కండ్లముందే ఎండిపోయింది.. పంట చేతికి అందక, అప్పు తడిసి మోపెడవటంతో తీవ్ర మనస్తాపంతో ఉరేసుకున్నాడు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతంలో శనివారం చోటుచేసుకున్నది. కొల్చారం ఎస్సై మహ్మద్‌గౌస్, గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాంచ మహేందర్ (35) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో పండినట్లుగానే పొలంలో పంట పండుతుందనే ఆశతో తనకున్న రెండెకరాల పొలంలో వరి సాగుచేశాడు. నాలుగు బోర్లు పుష్కలంగా నీరు పోస్తాయనే ధీమాతో పంట కోసం అప్పు కూడా తెచ్చాడు. అయితే లోవోల్టేజీతో మూడుసార్లు మోటర్లు కాలిపోయాయి.
పంట పెట్టుబడికి అయిన అప్పు, కాలిపోయిన మోటర్లకు చేసిన అప్పు తడిసి మోపడైంది. అదేసమయంలో నాలుగు బోర్లలో క్రమేపీ నీరు అడుగంటడంతో బోర్లలోంచి నీళ్లు రాలేదు. పంటంతా ఎండిపోయింది. ఆరునెలల కిందట వేసిన కొత్త బోరు కూడా అడుగంటిపోయింది. ఇంకో రెండు తడులు పారితే చేతికొచ్చే పంట ఎండిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. రూ.3 లక్షలు అప్పు కావటంతో ఆందోళన చెందాడు. శుక్రవారం రాత్రి అంతా ఇంట్లో నిద్రపోగా, తాను మాత్రం ఆరుబయట పడుకున్నాడు. అప్పటికే దిగాలుగా ఉన్న మహేందర్.. ఇంటి ఎదుట రేకుల షెడ్డులో చున్నీతో ఉరివేసుకొన్నాడు. ఇంట్లోవాళ్లు లేచి బయటకు వచ్చేసరికి రేకుల షెడ్డులో విగతజీవిగా కనిపించాడు. మృతుడికి భార్య సునీత, ఐదేండ్ల కుమారుడు, 13 ఏండ్ల కూతురు ఉన్నది. ప్రభుత్వం పరిహారం చెల్లించి మహేందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. మృతుడి తండ్రి శంకరయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ దవాఖానకు తరలించారు.
మహబూబ్‌నగర్ జిల్లా మద్దిగట్ల గ్రామానికి చెందిన కొత్త కుర్వ శ్రీశైలం (30)కు రెండెకరాల పొలం ఉన్నది. యాసంగిలో వరి సాగు చేశాడు. ఉన్న ఒక్క బోరు ఒట్టిపోవటంతో రూ.1.50 లక్షలు అప్పు చేసి మరో రెండు బోర్లు డ్రిల్లింగ్ చేయించాడు. అయినా కొద్దిపాటి నీరే రావటంతో ఆందోళన చెందాడు. అప్పటికే పంట పెట్టుబడి కోసం అప్పు చేశాడు. దీనికి తోడు గొర్రెలను కొనుగోలు చేసి ఆర్థికంగా దెబ్బతిన్నాడు. బోర్లు వేయటంతోపాటు పంట కోసం, కుటుంబ పోషణ కోసం చేసిన అప్పు రూ.6.50 లక్షలకు చేరింది. అప్పు విషయంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవ జరిగేది. ఈ క్రమంలో శనివారం కూడా ఇద్దరు గొడవపడ్డారు. అప్పుల బాధ, వేసిన బోర్లలో నీళ్లు సరిగా రాకపోవటంతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రీశైలం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొన్నాడని ఇరుగుపొరుగువాళ్లు వెల్లడించారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. భర్త మరణంతో భార్య ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు.