రవీంద్రభారతి, ఏప్రిల్ 27: బీసీ సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నదని తెలిపారు. బీసీల ఆత్మగౌరవం కోసం 41 కుల సంఘాలకు 87.3 ఎకరాల్లో 95 కోట్లతో ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామని వెల్లడించారు. భగీరథ మహర్షి వారసులైన సగరులకు సైతం కోకాపేటలో రెండెకరాలను కేటాయించడమే కాకుండా 2 కోట్ల నిధులను ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం వెచ్చించామని తెలిపారు. నాడు భగీరథ మహర్షి దివి నుంచి గంగను భువికి రప్పిస్తే, నేడు తెలంగాణ ప్రతి పంట పొలానికి గోదారిని మళ్లించిన సీఎం కేసీఆర్ అపర భగీరథుడయ్యాడని కొనియాడారు.
బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ సగర కులస్తులను బీసీ(ఏ)లో చేర్చాలని సీఎం కేసీఆర్‌కు నివేదికను అందించామని, త్వరలోనే అది నెరవేరుతుందని ప్రకటించారు. అంతకు ముందు భగీరథ స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు సగర సంఘం నేతలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ ఆర్ కృష్ణయ్య, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ కమిషన్ సభ్యుడు సీహెచ్ ఉపేంద్రాచారి, టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రటరీ మారుతీసాగర్, సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్‌సాగర్, ప్రధాన కార్యదర్శి గౌరన్న సాగర్, కోశాధికారి భిక్షపతి సాగర్, భూపేశ్‌సాగర్ సగర, గౌరవాధ్యక్షుడు హరికిషన్సాగర్ పాల్గొన్నారు.