గజ్వేల్, ఏప్రిల్ 20: మహారాష్ట్ర రైతు బృందం గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని హార్టికల్చర్ విశ్వవిద్యాలయం, ఫారెస్ట్ కళాశాల, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు, మర్కూక్ రైతువేదిక, వర్గల్ మండలం సింగాయిపల్లి అటవీ ప్రాంతం, గజ్వేల్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వైకుంఠధామం, కోమటిబండ మిషన్ భగీరథ సంప్, తొగుట మండలంలోని మల్లన్నసాగర్‌ను సందర్శించారు.
రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి వారికి తెలంగాణలో అమలవుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర రైతులు విజయ్ విలేకరి, జగదీశ్ బోండే, అజయ్దేశ్ ముఖ్, ప్రవీణ్కోల్గేలు మాట్లాడుతూ.. పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు పత్తి పంటను ఇంట్లోనే ఉంచుకున్నారని, అమ్ముకుంటే నష్టపోతామని దిగులు పడుతున్నారని చెప్పారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు అద్భుతమని, తెలంగాణ రైతులు అదృష్టవంతులని కొనియాడారు.
తెలంగాణలో ఎండలు మండుతున్నప్పటికీ.. ఎక్కడ చూసినా పచ్చదనం, పంటపొలాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఇక్కడి రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో తపన పడుతున్నారని, ప్రజల కోసం అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలుచేస్తూ తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. రైతులకు రైతుబీమా, రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంట్, ఎరువుల పంపిణీ, సాగునీరందించడం తాము ఎక్కడా చూడలేదని చెప్పారు. ఇక్కడ పథకాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఇంటింటికీ శుద్ధ్దిచేసిన మంచినీరు అందించడం, విశాలమైన పరిశుభ్ర వాతావరణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వైకుంఠధామం, అడవుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు చూస్తే సంతోషంగా ఉన్నదని చెప్పారు.
దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు అవసరమని, ఇలాంటి నాయకుడితోనే ప్రజలకు న్యాయం జరిగి దేశం సుభిక్షంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలోని విదర్భ ప్రాంతాల్లో సాగుకు నీళ్లు లేక ఎడారిగా మారడంతో రోజుకు ఆరేడుగురు చొప్పున రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తమ రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహారాష్ట్ర రైతుల బృందం యాదగిరిగుట్ట వెళ్లి లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకున్నారు.