కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తమ గ్రామాలను తెలంగాణలోనే కలుపాలని రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో డిమాండ్ ఊపందుకొన్నది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న వివాదాస్పద గ్రామాల ప్రజలు తెలంగాణలోనే ఉంటామని, 1996లో అప్పటి ఉమ్మడి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. తమ గ్రామాలను మహారాష్ట్ర నుంచి వేరుచేసి తెలంగాణలో కలిపితే తమ బతుకులు బాగుపడుతాయని పేర్కొంటున్నారు. భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటు సమయంలో మహారాష్ర్టలోని తెలుగు మాట్లాడే వారిని ఏపీలో కలుపగా.. ఇక్కడ హిందీ మాట్లాడే వారిని మహారాష్ట్రలో కలిపారు. ఆ సమయంలో ఇరురాష్ర్టాల మధ్య ఉన్న భూభాగంపై భౌగోళికంగా సరైన స్పష్టత ఏర్పడని కారణంగా ఇక్కడి 14 గ్రామాలు నేటికీ సమస్యాత్మక గ్రామాలుగానే మిగిలిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తాము పూర్తిస్థాయిలో పొందుతున్నామని, తమ గ్రామాలను పూర్తిస్థాయిలో తెలంగాణలో కలిపితే తమకు భద్రత కలుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తిచేస్తున్నారు.
భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటు సమయంలో మహారాష్ట్ర సరిహద్దులోని 12 గ్రామాలు సమస్యాత్మక గ్రామాలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు వాటి సంఖ్య 14కు చేరింది.. పరంధోళి, కోట, ముకుదంగూడ, లెండిజాల, శంకర్‌లొద్ది, బోలపటార్, అంతాపూర్, లెండిగూడ, ఎసాపూర్, ఇంద్రనగర్, గౌరి, పద్మావతి, మహారాజ్‌గూడ, లక్మాపూర్ గ్రామాలు తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో ఉండిపోయాయి. ఈ గ్రామాల ప్రజలకు రెండు రాష్ర్టాల్లో ఓటు హక్కు ఉన్నది. రెండు రాష్ర్టాలకు చెందిన రేషన్ కార్డులతోపాటు ప్రభుత్వ పరంగా అమలు చేసే సంక్షేమ పథకాలను రెండు ప్రభుత్వాల నుంచీ పొందుతున్నారు. 1976 నుంచి రెండు రాష్ర్టాలు ఈ గ్రామాలను కలుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. 1982లో వివాదం తారాస్థాయికి చేరింది. 1983లో ఏపీ నుంచి ఈ ప్రాంతంలోని గిరిజనులకు పోడు భూములపై పహానీలను అందించారు. 1991లో రెవెన్యూ, అటవీశాఖల ద్వారా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. 1996లో ఏపీ హైకోర్టు ఈ గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవిగా తీర్పునిచ్చింది. దీనిని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ వివాదాస్పద గ్రామాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇంకా ఈ వివాదం కొసాగుతూనే ఉన్నది. ఇప్పటికైనా తమ గ్రామాలను తెలంగాణలోనే కలుపాలని ఇక్కడి ప్రజలు బలంగా కోరుతున్నారు.
మా గ్రామాలను తెలంగాణలోనే కలపాలి. పరంధోళి నుంచి 1993లో మొదటిసారి ఏపీ ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలు నిర్వహించింది. అప్పుడు నేను సర్పంచ్‌గా ఎన్నిక య్యా. ఈ గ్రామాలను మహారాష్ట్రలో కలుపాలని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసిన తరువాత అక్కడి ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించింది. అప్పుడూ నేనే సర్పంచ్‌గా ఎన్నికయ్యా. రెండు రాష్ట్రాల నుంచి కూడా నేను సర్పంచ్‌గా పనిచేశా. తెలంగాణలోని పథకాలు బాగున్నాయి. ఇలాంటి పథకాలు మహారాష్ట్రలో లేవు. గ్రామాలను తెలంగాణలో కలపాలి.
– కాంబ్లే లక్ష్మణ్, మాజీ సర్పంచ్, పరంధోళి
నాకు, నా కొడుక్కి కలిపి నెలకు రూ.5 వేల పెన్షన్‌ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. దివ్యాంగుడూన నా కొడుకు వాగ్మారే బాబాసాహెబ్‌కు నెలకు రూ.3 వేలు, నాకు వృద్ధురాలి పింఛన్ రూ.2 వేలు వస్తున్నాయి. 30 కిలోల రేషన్ బియ్యం వస్తున్నాయి. వీటితోనే మేము బతుకుతున్నాం. మహారాష్ట్ర ప్రభుత్వం నెలకు వెయ్యి పింఛన్ మాత్రమే ఇస్తుంది. మమ్మల్ని తెలంగాణలోనే కలపాలి.
– వాగ్మారే శుభాబాయి, పరంధోళి
మా గ్రామాలకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించి, స్వచ్ఛమైన తాగునీరు అందించింది తెలంగాణ ప్రభుత్వమే. మా ఊర్లకు మంచి రోడ్లు వేయిస్తున్నది. అనేక పథకాలను అమలు చేస్తున్నది. ఇలాంటి ప్రభుత్వం పాలించే తెలంగాణలోనే మేము ఉండాలని కోరుకుంటున్నాం. అందుకే మా గ్రామాలను తెలంగాణలోనే కలపాలి.
– పవార్ గాయత్రి, మహారాజ్‌గూడ
నాకు తెలంగాణ పథకం కల్యాణలక్ష్మి కింద రూ.1,00116 వచ్చాయి. ఇలాంటి పథకం మహారాష్ట్రలో లేదు. మాలాంటి పేదింటి అమ్మాయిల కు పెండ్లి చేయాలంటే తల్లిదండ్రులకు ఎంతోభారం. కల్యాణలక్ష్మి పథకం మా కుంటుంబానికి ఆసరాగా నిలిచింది. మా గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుకుంటున్నా.
– రోషిని కిలారే, పరంధోళి
తెలంగాణ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే మా గ్రామాల్లో అమలవుతున్నాయి. మా గ్రామాలకు రోడ్లు, పింఛన్లు తెలంగాణ ప్రభుత్వమే ఇస్తున్నది. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చే పథకాన్నీ ఇక్కడి ప్రభుత్వమే అమలు చేస్తున్నది. మా భూములకు పట్టాలు ఇచ్చేందుకు సర్వేలు చేశారు. పట్టాలు ఇస్తే మాకు కూడా రైతుబంధు వస్తుంది. మా గ్రామాలకు పూర్తిగా తెలంగాణలోనే కలపాలి.
– జాదవ్ మాలన్‌బాయి, మహారాజ్‌గూడ