హైదరాబాద్, జనవరి 27(నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి పులి ప్రవేశించిందని, ప్రస్తుతం పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పులి కదలికలు ఉన్నాయని అటవీశాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
జాతీయ పులుల సంరక్షణ మార్గదర్శకాల మేరకు.. పులి సంచరించే జిల్లాల అటవీ అధికారులు నిరంతర నిఘా పెట్టారని తెలిపింది. కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పరిసర గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పశువులపై దాడి చేసినప్పుడు కలెక్టర్, అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది. పులిని పట్టుకునేందుకు ట్రాప్ కేజ్‌లు, థర్మల్ డ్రోన్లను వినియోగించనున్నట్టు వివరించింది.