హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, సీఎం కేసీఆర్ దార్శనికతతో స్ఫూర్తిపొందిన మహారాష్ట్ర ఎన్సీపీ నేత ప్రదీప్ సాలుంకే ‘తెలంగాణ- మాఝా అనుభవ్’ (తెలంగాణ – నా అనుభవాలు) అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని ఔరంగాబాద్‌లో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ప్రదీప్ సాలుంకే మాట్లాడుతూ తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని తాను మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని.. గట్టి పట్టుదలతో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యానని చెప్పారు. తెలంగాణ పురోగతిపై కేసీఆర్ కనబరిచిన అంకితభావం, చిత్తశుద్ధి తనను కట్టిపడేశాయని, ఈ నేపథ్యంలోనే పుస్తకాన్ని రచించానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని ఇందులో వివరించానని, తెలంగాణ తరహాలో మహారాష్ట్రలో రావాల్సిన మార్పులను ఉటంకించినట్టు చెప్పారు.