హైదరాబాద్, అక్టోబర్10 (నమస్తే తెలంగాణ): గోదావరి వరద జలాలను వినియోగించుకునేందుకు తమకూ హక్కుంటుందని మహారాష్ట్ర (Maharashtra) సర్కారు కరాఖండిగా తేల్చిచెప్పింది. ఏపీ పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు మళ్లిస్తే, ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఆ జలాల్లో న్యాయబద్ధంగా తమకు వాటా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖకు మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం పోలవరం నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 243 టీఎంసీల వరద జలాలను బనకచర్లకు తరలించేందుకు రూ. 81వేల కోట్లతో లింక్ ప్రాజెక్టుకు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టు ప్రీ ఫిజుబులిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్)ను కేంద్రజల్శక్తిశాఖకు సమర్పించింది. ఆ పీఎఫ్ఆర్ను అధ్యయనం చేసి అభిప్రాయాలు తెలపాలని కోరుతూ కేంద్రజల్‌శక్తిశాఖ తన పరిధిలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ), కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణా, గోదావరి రివర్ బోర్డులతోపాటు, బేసిన్‌లోని తెలంగాణతో సహా అన్ని రాష్ర్టాలకు లేఖలు రాసింది.
పీఎఫ్ఆర్పై కేంద్ర సంస్థలు, తెలంగాణ, కర్ణాటక సర్కారు సైతం తన అభిప్రాయాన్ని కేంద్ర జల్‌శక్తిశాఖకు వెల్లడించాయి. తాజాగా మహారాష్ట్ర సర్కారు సైతం పీబీ లింక్‌పై అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించింది. గోదావరి నుంచి కృష్ణాకు మళ్లించే జలాల్లో తమకూ వాటా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. గోదావరిలో మిగులు జలాల వినియోగానికి సంబంధించిన బచావత్ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా వెల్లడించిందని వివరించింది. గోదావరిలో మిగులు జలాలపై బేసిన్‌లోని రాష్ర్టాలకు వినియోగించుకునే హక్కు ఉంటుందని తెలిపింది. గోదావరి నుంచి కృష్ణాకు జలాలను మళ్లించినట్టయితే ఆ జలాల్లోనూ బేసిన్ రాష్ర్టాలకు వాటా ఉంటుందని కర్ణాటక గుర్తుచేసింది. 1978 బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కూడా పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణాబేసిన్‌కు మళ్లిస్తున్న 80 టీఎంసీల జలాలను కృష్ణాబేసిన్‌లోని రాష్ర్టాలైన నాటి ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీంఎంసీల చొప్పున వాటాను కేటాయించిందని ఉదహరించింది.
ప్రస్తుతం ఏపీ పోలవరం ద్వారా ఇప్పటికే 80 టీఎంసీలను మళ్లిస్తున్నదని, పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు మరో 243 టీఎంసీలను మొత్తంగా 423 టీఎంసీలను కృష్ణాకు మళ్లించనుందని వివరించింది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ అవార్డు గతంలో నిర్దేశించిన నిష్పత్తి ప్రకారం ఆ మళ్లించే జలాల్లోనూ తమకూ వాటా వస్తుందని తేల్చిచెప్పింది. కేంద్రం పీబీ లింక్ ప్రాజెక్టుకు అనుమతిస్తే అవార్డు ప్రకారం తమ వాటా వినియోగించుకుంటామని ఆ లేఖలో స్పష్టం చేసింది. ఇందులో పొరుగు రాష్ర్టాలతో సంప్రదించాల్సిన పనికూడా లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, వరద జలాల ఆధారంగా ప్రాజెక్టుల డీపీఆర్‌ల తయారీకి మార్గదర్శకాలు ఉంటే పంపించాలని, తాము కూడా వరద ఆధారిత ప్రాజెక్టుల డీపీఆర్‌లను పంపుతామని మహారాష్ట్ర వెల్లడించింది. తమ రాష్ట్రంలోనూ విదర్భ తదితర కరువు పీడిత ప్రాంతాలున్నాయని ఆ లేఖలో గుర్తుచేసింది.