హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రాజకీయ సంసరణల కోసం బీఆర్ఎస్లో చేరాలని బీఆర్ఎస్ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్ పిలుపునిచ్చారు. ఉత్తర మహారాష్ట్రలోని విజయపురిలో గురువారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాణిక్ కదమ్ మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ విప్లవాత్మక ఆలోచనలు తెచ్చారని కొనియాడారు. ఆయన ఆశయాల మేరకు దేశంలో సమూల మార్పు జరగాలంటే బీఆర్ఎస్లో చేరాలని అన్నివర్గాల ప్రజలను కోరారు. బీఆర్ఎస్ సామాన్యుల పార్టీ అని అభివర్ణించారు. నాసిక్, పింపాల్నర్, నందుర్బార్లో 7న, దుమ్ములో 8న, జల్గాంలో 9న బీఆర్ఎస్ సమావేశాలు నిర్వహించనున్నట్టు వివరించారు. ఉత్తర మహారాష్ట్రలోని అన్ని తాలూకాల నుంచి బీఆర్ఎస్ మద్దతుదారులు తరలివచ్చి పార్టీలో చేరాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ నాసిక్ డివిజన్ కోఆర్డినేటర్ దశరథ్ కాకా సావంత్, ఉత్తర మహారాష్ట్ర చీఫ్, రైతు నాయకుడు నానా సాహెబ్ బచ్చా, మరాట్వాడా కో ఆర్డినేటర్ సోమనాథ్ థోరట్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ బలోపేతానికి కృషి : శంకరన్న
రాబోయే కాలంలో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం నేత శంకరన్న దోండ్గే పిలుపునిచ్చారు. ఆయన విదర్భలోని అమరావతిలో గురువారం విస్తృతంగా పర్యటించారు. పలువురు రైతుసంఘం నేతలతో ఆయన సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఆఫీస్ బేరర్లతో కార్నర్ మీటింగ్ నిర్వహించి పార్టీ ప్రచారంపై పలు సూచనలు చేశారు. అమరావతి సమావేశంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జగదీస్రావు బొండే, నందుబావు సోమసి, నందకుమార్ ఖేర్డే, సుధాకర్ గైకి, సంజయ్ తైడే, విజయ్‌కుమార్ విలేకర్ తదితరులు పాల్గొన్నారు.