నిజామాబాద్: మహారాష్ట్రలో ఉన్న అనేక సమస్యలను గాలికొదిలేసి ఆ రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నాయకుల తెలంగాణలో ప్రచారం చేస్తున్నారని మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు అన్నారు. తెలంగాణ ప్రచారం చేసే హక్కుల ఆ రెండు పార్టీల నాయకులకు లేదని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేయడానికి మహారాష్ట్ర బీఆర్ఎస్ కోఆర్డినేటర్ వల్యాల నగేష్ నేతృత్వంలో ఆ రాష్ట్ర నాయకులు ఆదివారం నిజామాబాద్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని కలిశారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర నేతలు విలేకరులతో మాట్లాడుతూ..మహారాష్ట్ర నుంచి అశోక్ చౌహాన్ వంటి కాంగ్రెస్ నేతలు తెలంగాణలో ప్రచారం చేయడం సిగ్గుచేటని, మహారాష్ట్రలో ఏమీ చేయని కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల పట్ల అక్కడి ప్రజలు విసిగిపోయి ఉన్నారని, అందుకే తాము బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చామని చెప్పారు.
ఆదర్శ్ కుంభకోణానికి పాల్పడి ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన అశోక్ చౌహాన్ తెలంగాణకు పాఠాలు నేర్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న ఒక్క పథకం కూడా మహారాష్ట్రలో లేదని, అలాంటప్పుడు ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు తెలంగాణలో ప్రచారం చేసే హక్కు లేదని తేల్చిచెప్పారు. దమ్ముంటే తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్నవి మహారాష్ట్రలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేసి చూపించగలవా అని సవాలు విసిరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొంగల ముఠాగా తయారయ్యాయని మండిపడ్డారు.
తెలంగాణకే కాకుండా మాహారాష్ట్రకు కూడా బీఆర్ఎస్ పార్టీ అవసరమని, సీఎం కేసీఆర్ చేస్తున్న ఆదర్శవంతమైన పాలన మహారాష్ట్రలో కూడా రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు సచిన్ సొంటక్కే, సంతోష్ బోస్లే, సంతోష్ బోరా, మోసిన్ షేక్, హజీ షానవాజ్ బాగ్ వాన్, భాస్కర్ మర్గల్, సుకుమార్ సిద్ధం, శుభమ్ పాటిల్, అజిత్ సొంకట్లే పాల్గొన్నారు.