రవీంద్రభారతి, డిసెంబర్ 23 : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం శివనేనిగూడెం గ్రామ పరిధిలోని మహాలింగస్వామి ఆలయ భూములను(గుట్టలు) చిట్యాల తహసీల్దార్, ఆర్ఐ, సర్వేయర్లు అధికార పార్టీ నాయకులతో కుమ్మకై గ్రామానికి చెందిన ఓ కుటుంబం కబ్జా చేసినట్టు మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నేత దేవనాక దేవేందర్ ఆరోపించారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయ న మాట్లాడుతూ.. గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 34లోని 18.12 ఎకరాల భూమిలో 3 ఎకరాల భూమిని కబ్జా చేశారని తెలిపారు. గుట్టను ధ్వంసం చేసి కోట్ల విలువైన మట్టిని తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ విషయమై తహసీల్దార్ ఓ పత్రికలో బాటపంచాయితీ అని తప్పుడు వార్తలు రాయించి భూ కబ్జాదారులను వెనకేసుకొస్తున్నట్టు తెలిపారు. ఈ విషయమై ఆర్డీవోకు ఫిర్యాదు చేయగా, ఆయన కబ్జాదారులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని ఆదేశించినా..తహసీల్దార్ బేఖాతరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. చుట్టుపక్కల రైతులను సైతం ఇబ్బంది పెడుతున్నారని, వారు వారి భూములకు వెళ్లేందుకు దారిలేకుండా చేస్తున్నారని ఆరోపించారు.
అది లావణి భూమి అని, 20 ఏండ్ల క్రితమే అతనికి కేటాయించినట్టు తహసీల్దార్ తప్పును కప్పిపుచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశా రు. ఇప్పటికైనా ప్రభుత్వం, కలెక్టర్ స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకొని ఆలయ భూములను రక్షించాలని విజ్ఞప్తిచేశారు. లేకుంటే స్థానిక రైతులు, ప్రజలతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.