KTR | హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): మతిలేని పాలనలో బుల్డోజర్లే సమస్యలకు పరిష్కారమని నమ్మినప్పుడు ఇలాంటి దృశ్యాలే సాక్షాత్కరిస్తాయి అంటూ మహబూబ్‌నగర్‌లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూల్చివేసిన వికలాంగుల ఇండ్ల చిత్రాలను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు వ్యాఖ్యానించారు.
మహబూబ్‌నగర్‌లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెల్లవారుజామున మూడు గంటలకు ఓ దళిత కాలనీపై దాడికి దిగి 75 ఇండ్లను బుల్డోజ్ చేసిందని శనివారం ఎక్స్‌వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. ఇందులో 25 వికలాంగుల, అంధుల కుటుంబాలు ఉన్నాయని, వారి ఇండ్లు కూలగొట్టడం బాధాకరమని పేర్కొన్నారు.
తమ ఇండ్లు నేలమట్టం కావడంతో ఆ పేదలందరూ నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్ తొమ్మిది నెలల ప్రజాపాలన ఒక్కో చిత్రంలో ఉందని పేర్కొంటూ కూలిపోయిన పేదల ఇండ్ల ఫోటోలను షేర్ చేశారు.