మహబూబ్‌నగర్ : సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతులకు రైతుభరోసా ఇయ్యలేదని, కనీసం యూరియా బస్తాలు కూడా ఇయ్యడం లేదని, ఆసరా పెన్షన్లను పెంచుతానని చెప్పి పెంచలేదని, మహిళలకు రూ.2,500 ఇయ్యలేదని రేవంత్ తీరును తప్పుపట్టారు. మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరు ప్రజలు కాంగ్రెస్ పార్టీని పండబెట్టి తొక్కతరని చెప్పారు.
కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే.. ‘ఈ ముఖ్యమంత్రి రైతులకు రైతుభరోసా ఇయ్యడు. కౌలు రైతులకు రైతుభరోసా ఇయ్యడు. కనీసం యూరియా బస్తాలు ఇయ్యడు. యూరియా బస్తా కూడా ఇయ్యలేని ఈ ముఖ్యమంత్రి మొత్తం పాలమూరును సస్యశ్యామలం చేస్త అని చెప్తున్నడు. ప్రజలు నమ్ముతరా..? మళ్లీమళ్లీ ఆయన మాటలు నమ్మి మోసపోతరా..? ఒక్కసారి రెండుసార్లంటే నమ్ముతరు. ఊకె నమ్మి మోసపోతరా..? బీఆర్ఎస్ హయాంలో పాలమూరుకు 14 పరిశ్రమలను తీసుకొచ్చినం. రేవంత్‌రెడ్డి ఈ రెండేళ్లలో ఒక్క
పరిశ్రమనైనా ఎందుకు తేలేదు’ అని ప్రశ్నించారు.
ఇంకా మాట్లాడుతూ.. ‘మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ‘మా దగ్గర పైసలు లేవు’ అంటున్నడు. రేవంత్‌రెడ్డి ఉన్న పైసలన్నీ ఢిల్లీకి మూటగట్టి పంపుతుంటే ఇంక ఇక్కడ పైసలేడ ఉంటయ్. ఎమ్మెల్యేలకే పైసలు ఇయ్యనోడు రేపు సర్పంచ్‌లకు ఇస్తడా..? అస్సలే ఇయ్యడు. కొత్తగా గెలిచిన సర్పంచ్‌లకు ఓ మాట చెప్తున్నా. మీకు ఓ రెండేళ్లు కష్టముంటది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ గెలుస్తది. అప్పుడు పైసలొస్తయ్. అప్పటిదాకా ఓపిక పట్టండి’ అని సూచించారు.
‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆంధ్రా కాంట్రాక్టర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నడని జడ్చర్చ ఎమ్మెల్యే విమర్శిస్తున్నడు. మంత్రి జూపల్లి మొన్న ఆదిలాబాద్‌లో మాట్లాడుతూ.. ‘మేం మళ్లీ అధికారంలోకి వస్తమో.. రామో.. తెల్వదు. అందుకే నేను హామీలు ఇయ్యను’ అన్నడు. కాంగ్రెస్ గెలిచేది లేనిది ఆయనకు తెలుసో తెలువదో మాకు తెలువదుగానీ, పాలమూరు ప్రజలకు మాత్రం బాగా తెలుసు. వచ్చే ఎన్నికల్లో పాలమూరు ప్రజలు కాంగ్రెస్ పార్టీని పండబెట్టి తొక్కుతరు. ఇది ఖాయం. కొడంగల్‌తో సహా 14 నియోజకవర్గాల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందపెట్టబోతున్నరు’ అని కేటీఆర్ చెప్పారు.