DIET College | మహబూబ్‌నగర్ విద్యావిభాగం, ఆగస్టు 4 : మహబూబ్‌నగర్ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు తలమానికంగా నాడు కళకళలాడిన ఈ కాలేజీ నేడు అధ్యాపకుల కొరత, అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నది. కనీస సదుపాయాలు కూడా లేకపోవటంతో విద్యార్థినులు, అధ్యాపకులు ఆవేదనకు గురవుతున్నారు. ఏటా సమర్థులైన 150 మంది ఉపాధ్యాయులను తయారు చేయడమే లక్ష్యంగా ఈ కళాశాలను 1989లో ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్‌తోపాటు 29 మంది అధ్యాపకులు ఉండాల్సిన చోట కేవలం ఇద్దరు బోధకులతోనే నెట్టుకొస్తున్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మీడియంలో ప్రథమ సంవత్సరంలో 150, ద్వితీయ సంవత్సరంలో 150 మంది విద్యార్థులు ఏటా సరాసరి 300 మంది విద్యనభ్యస్తుంటారు.
కళాశాలలో ఇంతమందికి కేవలం రెండే మూత్రశాలలు అందుబాటులో ఉన్నాయి. బాలురకు మూత్రశాలలు లేకపోవడంతో వారు ఆరుబయటకు, చెట్ల చాటుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. స్వచ్ఛత గురించి చెబుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యలను మాత్రం పట్టించుకోవటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ లేకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో ఇచ్చిన నల్లా ద్వారా వచ్చే కొద్దిపాటి నీటిని నిల్వ చేసుకుని వాటినే మూత్రశాలల్లో వాడుకోవాల్సి వస్తున్నది.
సరిపోను నీళ్లు లేకపోవటంతో మూత్రశాలలు, మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. హాస్టల్ వసతి లేక.. ప్రైవేటులోనే విద్యార్థినులు అధిక డబ్బులు వెచ్చించి అద్దెగదుల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. శనివారం డైట్లో నిర్వహించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు వచ్చిన విద్యార్థులు, వారి బంధువులు, సహాయకులు సైతం కనీస వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డైట్ కళాశాల సమస్యలను జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులకు విన్నవించామని ఇన్చార్జి ప్రిన్సిపాల్ మేరాజుల్లాఖాన్ తెలిపారు. కలెక్టర్, డీఈవో దృష్టికి తీసుకెళ్లినా సమస్యలు తీరుస్తామని చెబుతూనే ఉన్నారని పేర్కొన్నారు.