ఇనుగుర్తి, ఆగస్టు 10 : పంట దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక యువరైతు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. ఇనుగుర్తి మండలం కోక్యాతండాకు చెందిన జాటోత్ రమేశ్ (36) తనకున్న ఎకరం భూమితోపాటు 10 ఎకరాలు కౌలుకు తీసుకొని మూడేండ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. పత్తి, మిర్చి, వరి పండిస్తున్నాడు.
ఈ మూడేండ్లలో సుమారు రూ.15 లక్షల వరకు అప్పు తెచ్చి పంట పెట్టుబడిగా పెట్టాడు. పంట దిగుబడి సరిగ్గా రాక, అప్పులు తీర్చే మార్గం కానరాక తీవ్ర మనస్తాపంతో శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేశ్‌కు భార్య జ్యోతి, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. తండ్రి చక్రు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కేసముద్రం ఎస్సై మురళీధర్‌రాజ్ తెలిపారు.