నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 1: మహా శివరాత్రి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా జరుపుకొన్నారు. మహాదేవుడి దర్శనానికి శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. హరహర మహాదేవ.. శంభోశంకర అంటూ పంచాక్షరీ స్మరణ చేస్తూ తన్మయత్వం చెందారు. జాగారం పాటించి, పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ప్రసిద్ధ వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానంతోపాటు కీసర రామలింగేశ్వరాలయం, ఏడుపాయల వనదుర్గా భవానీ క్షేత్రం, కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయాలు, హనుమకొండ వేయిస్తంభాల గుడి మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయాయి.
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగాయి. వేములవాడ రాజన్న దర్శనానికి 2.50 లక్షల మంది తరలివచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో అర్ధరాత్రి శివజ్యోతిని దర్శించుకొని భక్తులు పరవశించిపోయారు. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం పెద్దగుడిబండ రామలింగేశ్వరస్వామి మూలవిరాట్‌పై సూర్యకిరణాలు పడ్డాయి.
పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రులు
వేములవాడలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్ ప్రభుత్వం తరఫున రాజరాజేశ్వరస్వామివారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవానీ మాత జాతరకు మంత్రి హరీశ్‌రావు కుటుంబ సమేతంగా హాజ రై, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుటుంబంతో కలిసి ఏడుపాయల అమ్మవారిని దర్శించుకొన్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి సోమేశ్వరాలయం లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీసమేతంగా పూజలు చేశారు. మహబూబా బాద్ జిల్లా కురవి వీరభద్రస్వామికి మంత్రి సత్యవతిరాథోడ్ బంగారు మీసం, ముక్కు పుడక సమర్పించారు. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలో మంత్రి జగదీశ్‌రెడ్డి పూజలు చేశా రు. జగిత్యాల జిల్లా పెగడపల్లి రాజన్న ఆలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మొక్కులు చెల్లించుకొన్నారు. నల్లగొండ జిల్లా చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకొన్నారు.