యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హరిహర క్షేత్రంగా యాదాద్రి భక్తజనులను అలరిస్తున్నది. హరికి, శివుడికి బేధం లేదని నిరూపిస్తూ శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధి, శివాలయం పక్కపక్కనే కొలువై పూజాభిషేకాలు అందుకొంటున్నాయి. వందేండ్ల క్రితం నిర్మించిన ఇక్కడి పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర ఆలయం యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా కొత్త సొబగులను సంతరించుకొన్నది. ఈ నెల 25 నుంచి భక్తులకు దర్శనమిచ్చేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లక్ష్మీనారసింహుని ప్రధానాలయానికి దీటుగా శివాలయాన్ని రూ.60 కోట్ల వ్యయంతో కృష్ణశిలలతో నిర్మించారు. తొగుట స్వామీజీ శ్రీమాధవానంద సూచనల మేరకు నిర్మాణాన్ని పూర్తి చేశారు. శివకేశవులు ఒక్కటే అని నిరూపిస్తున్న యాదాద్రిలోని ఈ శివాలయంలో బుధవారం నుంచి మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు.
మహాద్భుతంగా నిర్మాణాలు..
యాదాద్రి లక్ష్మీనరసింహుడిని దర్శనం చేసుకొన్న తర్వాత భక్తులు శివాలయాన్ని దర్శించుకోవచ్చు. కొండ కింది నుంచి వైకుంఠం మెట్ల ద్వారా వచ్చే భక్తులు మాత్రం ప్రధానాలయంలోని స్వామివారి కంటే ముందుగానే శివుడిని దర్శించుకోవచ్చు. త్రితల రాజగోపురం నుంచి శివాలయంలోకి ప్రవేశిస్తే.. మహాద్భుతమైన అనేక నిర్మాణాలు సాక్షాత్కరిస్తాయి. శివాలయంతోపాటు త్రితల రాజగోపురం, ముఖ మండపం, పార్వతీదేవి మందిరానికి కృష్ణశిలను ఉపయోగించారు. ఇదే ఆవరణలో పరివార దేవాలయాలైన పార్వతీ దేవి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఉప ఆలయాలను నిర్మించారు. నవగ్రహాలు, యాగశాలలనూ నిర్మించారు. సాలహారాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు, శైవ సంబంధ విగ్రహాలను అమర్చారు. గర్భగుడికి ఎదురుగా ఏర్పాటుచేసిన పెద్ద నంది విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. దీనికి పక్కనే ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. మహాముఖమండపం చెంత స్పటిక లింగ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఈనెల 25న చేపట్టనున్నారు. చారిత్రక వైభవానికి తగ్గట్టే నూతన ఆలయాన్ని తీర్చిదిద్దారు.
25 నుంచి భక్తులకు దర్శనం
శివాలయం మహాకుంభాభిషేక మహోత్సవానికి ముస్తాబైంది. బుధవారం నుంచి ఈ నెల 25 వరకు జరిగే మహాకుంభాభిషేక పర్వాలు వినాయక పూజతో మొదలు కానున్నాయి. 25 నుంచి భక్తులను అనుమతిస్తారు.
25న యాదగిరిగుట్టకు కేసీఆర్
పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం పునః ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ ఈ నెల 25న యాదాద్రి రానున్నారని ఈవో గీత తెలిపారు. ఉదయం 10:25 గంటలకు ధనిషా ్టనక్షత్ర యుక్త మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తాన తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి చేతులమీదుగా జరిగే రామలింగేశ్వర స్ఫటికలింగ ప్రతిష్ఠ, అష్టబంధం ప్రాణప్రతిష్ఠ, ప్రతిష్ఠాంగహోమం, అఘోర మంత్ర హోమం, దిగ్దేవతా క్షేత్రపాలక బలిహరణం, శోభాయాత్ర, కలశ ప్రతిష్ఠాపన మహోత్సవంలో సీఎం కేసీఆర్ సతీసమేతంగా పాల్గొంటారు. రామలింగేశ్వర స్వామివారి ప్రధానాలయాన్ని పునః ప్రారంభిస్తారని చెప్పారు.
వందేండ్లనాటి ఆలయం
యాదాద్రిలో స్వయంభువులు కొలువుదీరిన ప్రధానాలయానికి అనుబంధంగా ఉన్న శివాల యం శైవాగమ శాస్త్రయుక్తంగా కృష్ణశిలలతోనే నిర్మితమైంది. స్లాబ్ వరకు కృష్ణశిలను వినియోగించగా, పైన సాలహారాలను ఇటుకలతో నిర్మించారు. 1913-15 సంవత్సర కాలంలో నారసింహుడి ఆలయానికి తూర్పున ఉన్న శివాలయంలో లింగ ప్రతిష్ఠ జరగ్గా.. ఐదేండ్ల తర్వాత కంచి కామకోఠి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో పర్వతవర్ధిని పేరుతో అమ్మవారిని ప్రతిష్ఠించారు. అప్పటినుంచి ఈ ఆలయం పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. లక్ష్మీనారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు ఏటా మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆరు రోజులపాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.