మహబూబాబాద్ రూరల్, నవంబర్ 19: లగచర్ల ఘటన, గిరిజన రైతుల సమస్యలు, ఎన్నికల హామీలు అమలు చేయాలని ఈ నెల 21న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహా ధర్నా నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారని పేర్కొన్నారు. మంగళవారం రవీందర్రావు బీఆర్ఎస్ నాయకుతో కలిసి పట్టణంలోని ఎమ్మార్వో సెంటర్లో మహాధర్నా కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. అధికారం ఉంది కదా అని రేవంత్రెడ్డి లగచర్ల రైతులపై పోలీసులతో దాడులు చేయించి జైలుకు పంపించారని విమర్శించారు. లగచర్ల గిరిజన రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటూ వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నదదని చెప్పారు. రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. మానుకోట జిల్లాలో అధిక సంఖ్యలో గిరిజన రైతులున్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా నిర్వహిస్తున్నామని స్పష్టంచేశారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి అధిక సంఖ్యలో గిరిజన రైతులు తరలివచ్చి విజయవంతం చేయాలని తక్కళ్లపల్లి పిలుపునిచ్చారు.